తెలంగాణను దోచుకొనేందుకే.. మహాకూటమిగా ఏర్పడ్డారు
– కూటమి కుట్రలను ఓటు ద్వారా తిప్పికొట్టండి
– కేసీఆర్ సీఎంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం
– అభివృద్ధిని కొనసాగించేలా టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి
– అన్ని వర్గాల ప్రజలకు అండగానిలిచేది టీఆర్‌ఎస్ మాత్రమే
– నిర్మల్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, నవంబర్13(జనంసాక్షి) : నాలుగేళ్ల పాటు అభివృద్ధి చేసుకున్న తెలంగాణను.. దోచుకొనేందుకే టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని, డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ఓటు ద్వారా కూటమికి కుట్రలను తిప్పికొట్టాలని నిర్మల్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో నిర్మల్ మండలం అనంతపేట గ్రామానికి చెందిన 400 మంది, పోచంపహాడ్ గ్రామానికి చెందిన 200 మంది, వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన 250 మంది, చిట్యాల్ గ్రామానికి చెందిన 200 మంది, సారంగాపూర్ మండలం కౌట్ల గ్రామానికి చెందిన 100 మంది, నిర్మల్ పట్టణం వైయస్సార్ కాలనీకి చెందిన 70 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి అల్లోల సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరుతున్నారన్నారు. ఏనాడూ ప్రజల గురించి పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీలు అభివృద్దిని జీర్ణించుకోలేకే మహాకూటమిగా ఏర్పడి తెలంగాణను దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. కర్రు కాచి వాత పెట్టినట్లు ప్రజలు వారికి ఓటుతో బుద్ది చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, నిర్మల్ ఏయంసీ ధర్మాజీ రాజేందర్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరి రావు, అల్లోల మురళీధర్ రెడ్డి, డా.మల్లికార్జున రెడ్డి, రాంకిషన్ రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ముత్యంరెడ్డి, చిట్యాల్ సర్పంచ్ రమేష్ రెడ్డి, అనంతపేట ఎంపీటీసీ దాసరి పంతులు, మాజీ ఎంపీటీసీ నేరెళ్ల అశోక్, కోట చిన్న లింగ్నన, చిన్న గంగన్న, కుంటాల రాజేశ్వర్ అలియాస్ రానా, పోలీసు భీమేష్, పోలీసు నవీన్ తదితరులు పాల్గొన్నారు.