తెలంగాణపై..ఉక్కుపాదం
ప్రజాస్వామ్య ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి సాగుతున్న మహోద్యమంపై గతంలో లాగానే రాజ్యం కన్నెర్ర చేసింది. తమ వైఖరిని వ్యతిరేకిస్తున్న ప్రజా గొంతుకను నొక్కేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. నాలుగు కోట్ల మంది ప్రత్యేక రాష్ట్రం కోసం దాదాపు ఆరు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నా పట్టించుకోకుండా ప్రపంచంలో ఏ ఉద్యమానికి అవసరం లేని ‘ఏకాభిప్రాయం’ అనే పరదా తగిలించి, ఉద్యమంపై తన బలగం బలం ప్రయోగించి ఉక్కుపాదాన్ని మోపేందుకు తన కుతంత్రాన్ని రచిస్తోంది. ఎల్లుండి తెలంగాణ జేఏసీ నాయకత్వంలో జరుగనున్న తెలంగాణ మార్చ్, సాగర హారాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తునే కుట్రలు చేస్తోంది. ఇంతకాలం అవాకులు చెవాకులు పేల్చి, శాంతి భద్రతలని, మత ఘర్షణలని, వినాయక నిమజ్జమని, జీవ వైవిధ్య సదస్సని తెలంగాణవాదులను శాంత పర్చేందుకు, తెలంగాణ మార్చ్‌ను నిలువరించేందుకు చూసిన ప్రభుత్వం, ఇప్పుడు భౌతిక దాడులు చేసేందుకు
సిద్ధపడుతోంది. దీనికి పోలీసులను సమాయత్తపరుస్తున్నది. తెలంగాణ మార్చ్‌లో పాల్గొనేందుకు వెళ్లే ప్రజలను అడ్డుకునేందుకు తెలంగాణలోని పది జిల్లాల్లో వందలాది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఒక్క కరీంనగర్‌లోనే పదింటిని ఏర్పాటు చేసింది. వేలకు వేల మంది పోలీసులను రంగంలోకి దింపింది. శాంతియుతంగా మార్చ్‌లో పాల్గొందామనుకున్న తెలంగాణవాదులను రెచ్చగొట్టేందుకు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. చెక్ పోస్టుల దగ్గర ఎడాపెడా తనిఖీలు చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తెలంగాణ మార్చ్‌తో ప్రభుత్వం గుండెల్లో గుబులు పుడుతున్నా, అది కనబడకుండా కప్పి పుచ్చుకునేందుకు తెలంగాణవాదులపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. తెలంగాణవాది అన్న అనుమానం కలిగితే చాలు పోలీసుల చేత ముందస్తుగానే, మార్చ్‌లో పాల్గొనకుండా చేసేందుకు అక్రమ అరెస్టులకు దిగుతున్నది. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా అరెస్టయిన తెలంగాణవాదుల సంఖ్య వందల్లో ఉంటే, కేవలం కరీంనగర్ జిల్లాలోనే 105 మందిని అరెస్టు చేయించింది. తెలంగాణవాదుల అరెస్టులతో ఠాణాలన్నీ కిక్కిరిసి పోతున్నాయి. తెలంగాణవాదులనే కాకుండా ఆఖరికి పౌర హక్కుల సంఘం నేతలను కూడా ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. వారిని కూడా అక్రమంగా అరెస్టులు చేస్తూ తన నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నది. అరెస్టయిన రాష్ట్ర హక్కుల నేతల్లో రఘునాథ్, లింగయ్య, కుమారస్వామి, ఏనుగు మల్లారెడ్డితోపాటు పది మంది ఉన్నారు. శాంతియుతంగా మార్చ్ నిర్వహణ జరుగకుండా పాలకులు చేస్తున్న ఈ దుశ్చర్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మార్చ్‌కు వెళ్లితీరుతామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతామని హెచ్చరిస్తున్నారు.