తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ

రక్షణ శాఖ భూముల కేటాయింపులో వివక్ష

లోక్‌సభలో మండిపడ్డ టిఆర్‌ఎస్‌ ఎంపి జితేందర్‌ రెడ్డి

వెల్‌లోకి దూసుకెళ్లి ఎంపిల నిరసన

న్యూఢిల్లీ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపుతుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించక పోవడాన్ని నిరసిస్తూ ఎంపీ లోక్‌సభలో మాట్లాడారు. బైసన్‌ పోలో, జింఖానా మైదానాలను రాష్ట్రానికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఒకటో నంబర్‌ రాష్ట్ర రహదారి అభివృద్ధికి, 44వ నంబర్‌ జాతీయ రహదారికి రక్షణ శాఖ భూములివ్వాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేదని ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని కోపోద్రిక్తులయ్యారు. ఇటీవల కర్ణాటక ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలిపిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి వెళ్లారు. తెలంగాణకు న్యాయం చేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. బైసన్‌ పోలో గ్రౌండ్స్‌ బదలాయింపుపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు ఎంపీ జితేందర్‌ రెడ్డి. బైసన్‌ పోలో గ్రౌండ్స్‌ కేటాయించాలని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. బైసన్‌ పోలో గ్రౌండ్స్‌లో.. తెలంగాణ కొత్త సవిూకృత సచివాలయంను కట్టుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని చెప్పాడు. ఇప్పుడున్న సచివాలయం సదుపాయాల పరంగా అవసరాలకు అనుగుణంగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా.. మూడేళ్ల క్రితం జైట్లీ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారని.. కేంద్రం చెప్పిన షరతులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. అయినా.. కేంద్రం ఇంకా నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని జితేందర్‌ రెడ్డి మండిపడ్డారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవతితల్లిలా తెలంగాణను ట్రీట్‌ చేస్తున్నారన్నారు. అదే.. ఏపీకి మాత్రం ఏది కావాలన్న క్షణాల్లో మంజూరు చేస్తున్నారని.. సభ దృష్టికి తెచ్చారు. ఇది సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ¬ంమంత్రి .. ఇప్పటికైనా స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇదే అంశంపై ఇవాళ తాము.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలుస్తామని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. తెలంగాణ పై వివక్షను మానుకోవాలన్నారు.