తెలంగాణపై పెత్తనం కోసమే బాబు కూటమి
తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకుందాం
ప్రచారంలో జోగురామన్న పిలుపు
ఆదిలాబాద్,నవంబర్26(జనంసాక్షి): మహాకూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని
మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. చంద్రబాబు చేతుల్లోకి తెలంగాణ వెళితే మళ్లీ ఆంధ్రా పాలకుల పెత్తనం వస్తుందని అన్నారు. ఎన్నికల్లో కూటమి నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. తెలంగాణలో పెత్తనం కోసమే బాబు కూటమి కట్టారని మండిపడ్డారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పరుల పాలు కాకుండా కాపాడుకోవాలని అన్నారు. వివిధ గ్రామాల్లో ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ రంగినేని మనీషాతో కలసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రిని గ్రామస్తులు సన్మానించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, అందుకోసం ప్రజలందరూ అండగా నిలవండి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. విపక్షాలు అభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నం తప్ప మరొకటి లేదన్నారు. ప్రతిపక్షాలు అధికారం కోసం పార్టీ సిద్దాంతాలను తుంగలో తొక్కి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్‌ను ఓడించే పార్టీకానీ, నాయకుడు కాని లేరన్నారు. అందుకే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో జత కట్టిందని, వీటితో పాటు తెలంగాణ జన సమితి, సీపీఐలు ఒకటయ్యాయన్నారు. సీట్లు కూడా సర్దుబాటు చేయలేని కూటమికి ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు లేరన్నారు. నాలుగున్నర ఏళ్లలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. 68 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేక ఘోరంగా విఫలమయ్యాక టీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బడుగుబలహీన వర్గాల అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని, ఏ ఒక్కరూ అభివృద్ధి చెందలేదన్నారు. గత పాలనలో పింఛన్ లబ్దిదారులు వందల సంఖ్యలో ఉంటే కొందరికి మాత్రమే అందేదని, అధికారుల వద్దకు వెళ్లి విన్నవిస్తే ఎవరైనా చనిపోతే తప్పా గ్రామంలో కొత్త పింఛన్ అమలు కాదని చెప్పేవారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.