తెలంగాణపై మాటిచ్చాకే విజయమ్మ సిరిసిల్ల రావాలి

కోనరావుపేట, జూలై 22 (జనంసాక్షి) : 4.5కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఏర్పాటుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఒక స్పష్టమైన వైఖరిని వెల్లడించాకే తెలంగాణాలో సభలు, సమావేశాలు నిర్వహించాలని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. సోమ వారం సిరిసిల్లలో వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను అడ్డుకుం టామన్నారు. ఆదివారం కోన రావుపేట మండలం నిమ్మ పల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు హాజరైన ఆయన విలేకరు లతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే నాయకులనే ప్రజలు గౌరవి స్తారని అన్నారు. తెలంగాణ అంశాన్ని ఉన్నన్నాళ్లూ వైఎస్సార్‌ తొక్కిపెట్టారని ఆయన సతీమణి ఏం చేద్దామని సిరిసిల్లాకు వస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సరస్వతీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ||లు 2లక్షల నిధులు మంజూరి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 132/11కెవి విధ్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులను రైతులచే ప్రారంభోత్సవం చేయించారు.  ప్రజా ప్రతినిథులు, పార్టీ కార్యకర్తలు గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, బండ నర్సయ్యయాదవ్‌, బండ సత్తయ్య, నరాల సత్తెమ్మ-పోచెట్టి, ఇస్లావత్‌ రాములునాయక్‌, మల్యాల దేవయ్య, ఎర్రం మహేష్‌, పూజం రాజు, దొంతరవేని శ్రీనివాస్‌, ప్రతాపరెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.