తెలంగాణలో అట్టహాసంగా ప్రారంభమైన పుష్కరాలు
– ధర్మపురిలో సీఎం కేసీఆర్ పుణ్యసాన్నం
– శోభాయమానంగా శోభాయాత్ర
కరీంనగర్,జులై14(జనంసాక్షి):
తెలంగాణలో గోదావరి పుష్కరాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు శాస్తోక్త్రంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం ఏర్పడ్డ తరవాత వచ్చిన ఈ పుష్కరాలు అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించేందకు సకల ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా అంగరంగ వైభవంగా గోదావరి పుష్కర సంరంభం నేటి నుంచి 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. గోదావరిలో పీఠాధిపతులు, సీఎం పూజలు చేశారు. కోలాటాలు, భజనలతో పీఠాధిపతుల శోభాయాత్రలో సీఎం పాల్గొని పుష్కర ఘాట్‌కు చేరుకుని స్నానమాచరించి పుష్కరాలను తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. పీఠాధిపతులతో కలిసి గోదావరి నదికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా పుష్కరస్నానమాచరించారు. తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో పుష్కరఘాట్లు కిటకిటలాడుతున్నాయి. ధర్మపురి పుష్కరాలలో సీఎం కేసీఆర్‌తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు కుటుంబ సమేతంగా పుణ్య నదిలో పుష్కర స్నానమాచరించారు. వారితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవెందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ తుల ఉమ, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పుష్కర స్నానాలు చేశారు. ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలచారి, కెవి రమణాచారి తదితరులు కూడా ఇక్కడే స్నానాలు ఆచరించారు. ధర్మపురిలో గోదావరి పుష్కరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం స్థానిక లక్ష్మీనరసింహస్వామి గుడికి చేరుకుని బయటి నుంచే మొక్కులు సమర్పించారు. తర్వాత 9.45గంటలకు వివిధ అభివృద్ధి పనులు తెలిపేలా ఏర్పాటు చేసిన పుష్కరాల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు.
కాళేశ్వరంలో ఈటెల, తలసాని
కాళేశ్వరంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌లు పుష్కర పుణ్యస్నానం ఆచరించారు. కాళేశ్వరానికి భారీగా భక్తులు తరలిరావడంతో పుష్కర ఘాట్లు కిటకిటలాడాయి. గోదావరి పుష్కరాలను కుంభమేళా కంటే గొప్పగా రూ.600 కోట్లతో నిర్వహిస్తున్నట్టు ఆర్థిక, పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా అన్నారు. మంగళవారం ఉదయం 6.25గంటలకు కాళేశ్వరంలోని గోదావరిలో మంత్రి పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. పుష్కర ఏర్పాట్లను నాలుగు నెలల నుంచి యుద్ధప్రాతిపదికన పూర్తిచేశామని తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అనంతరం వాణిజ్య పన్నుల శాఖామంత్రి శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలలో భక్తులు అశేషంగా పాల్గొని పునీతులు కావాలని కోరారు.
కార్యక్రమంలో శాసన సభ్యులు పుట్టమధు, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, స్పెషల్ ఆఫీసర్ సూరజ్ కుమార్, ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలకు భారీగా తరలివచ్చిన భక్తులు కాళేశ్వరంలో ఆందోళనకు దిగారు. పుష్కర ఘాట్ల వద్ద సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రూపాయల టికెట్ తీసుకుని కంకర రోడ్డుపై నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వెలగటూరు మంలం కోటిలింగాల పుణ్యక్షేత్రంలో తొలిదశలో 20 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు.
భద్రాలంలో చినజీయర్ స్వామి
భద్రాచలం గోదావరి తీరంలో చినజియర్‌స్వామి పుణ్యస్నానమాచరించారు. సోమవారం సాయంత్రమే భద్రాచలానికి చేరుకున్న స్వామి ఉదయమే గోదావరి తీరానికి వెళ్లి పుణ్యస్నానమాచరించి పుష్కరుడికి స్వాగతం పలికారు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో అంకురార్పణ కార్యక్రమం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్లు, భవనశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పుణ్య గోదావరిలో పుష్కర స్నానాలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఇక్కడే గోదావరిలో పుణ్యస్నానం చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులకు భద్రాచలం వద్ద పుష్కరఘాట్లనీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భద్రాచలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. గోదావరి పుష్కరాలకు వచ్చిన భక్తులు శ్రీ రామచంద్ర మూర్తిని దర్శించుకోవడానికి బారులు తీరారు. పుష్కరాల కోసం వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది. సారపాక నుంచి భద్రాచలం వరకు బస్సులు నడిపిస్తున్నారు. భక్తులతో గోదావరి తీరం కిటకిటలాడుతోంది.