తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్‌

రాష్ట్రంలో పాలన చేతగాక విమర్శలా: లక్ష్మణ్‌
హైదరాబాద్‌,సెప్టెంబర్‌1 జనం సాక్షి : : తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్‌ అని బిజెపి ఎంపి డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారనిలక్ష్మణ్‌ అన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముఖం చాటు చేస్తున్న కెసిఆర్‌.. జాతీయ రాజకీయాలు అంటూ ఇంతకాలం ఆర్భాటాలు చేశారని, ఆఖరుకు తను కలుసుకున్న పార్టీల నేతలే కెసిఆర్‌ను దూరం పెట్టారని ఎద్దేవా చేశారు. దేశంలోని నేతల చుట్టూ తిరిగి కేసీఆర్‌ తెలంగాణా పరువు తీశారన్నారు. కేసీఆర్‌ అభాసు పాలయ్యారని.. తెలంగాణలో అనేక సమస్యలతో సతమతమవుతుంటే కేసీఆర్‌ పట్టింపు లేకుండా ఉన్నారని అన్నారు. అయినా కేసీఆర్‌ కాంగ్రెస్‌కు దగ్గర కావాలని ఆరాట పడుతున్నారని అన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్‌ ఎందుకు ఆదుకోవడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌ పట్టించు కోవడంలేదని సీరియస్‌ అయ్యారు. ప్రగతి భవన్‌, ఫాంహౌస్‌ కే పరిమితమైన కేసీఆర్‌ అదే ప్రపంచ మనుకుంటున్నారని.. ఇప్పుడు దేశ రాజకీయమంటూ కొత్త నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఓటమి భయం కేసీఆర్‌కు బాగా పట్టుకుందని లక్ష్మణ్‌ తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.

తాజావార్తలు