తెలంగాణలో బహుముఖ అభివృద్ది

అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది: వినోద్‌

న్యూఢిల్లీ,నవంబర్‌11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ.ఎస్‌.డీ. అయిన సీనియర్‌ ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ అధికారి సీ. రాజశేఖర్‌ బుధవారం ఢిల్లీలో వినోద్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురి భేటీలో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఇదివరకు ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ అధికారులు కేవలం అంతర్జాతీయంగా విదేశాంగ మంత్రిత్వ వ్యవహారాలను మాత్రమే చూస్తుండేవారు. కాగా రాష్ట్రాలతో సమన్వయం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సీనియర్‌ ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ అధికారి అయిన తెలంగాణ రాష్టాన్రికి చెందిన నల్లగొండ జిల్లా బిడ్డ సీ. రాజశేఖర్‌ రాష్టాల్ర సమన్వయం కోసం ఓ.ఎస్‌.డీ. గా నియమితులయ్యారు. ఈ విభాగం దేశంలోని 28 రాష్టాల్రకు చెందిన వివిధ అంశాల పరిష్కారానికి సమన్వయం చేస్తుంది. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యుత్‌ సరఫరా, నీళ్లు, వ్యవసాయరంగ ప్రగతి, ఐటీ రంగంలో సాధించిన విజయాలు, రాష్ట్రంలో శాంతి భద్రతలు, న్యాయ స్థానాల్లో కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉండటం వంటి అంశాలను వివరించారు. దేశ పర్యటనకు విచ్చేసే విదేశీ టూరిస్టులు తెలంగాణలో పర్యటించే విధంగా చొరవ చూపాలని వినోద్‌ కుమార్‌ కోరారు. రాష్ట్రంలో అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, అడవులు, జలపాతాలు, వన్యప్రాణులు ఉన్న విషయాన్ని రాజశేఖర్‌ దృష్టికి తీసుకొచ్చారు. రాజశేఖర్‌ను రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా కోరిన వినోద్‌కుమార్‌ హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఇరువురి భేటీ అనంతరం వినోద్‌ కుమార్‌ స్పందిస్తూ.. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు, విదేశాలలో రాష్ట్ర అంశాల పరిష్కారాలపై రాజశేఖర్‌తో జరిగిన సమావేశం ద్వారా భరోసా కలిగిందన్నారు.