తెలంగాణలో బిఆర్‌ఎస్‌ బేకార్‌

బిజెపితోనే అభివృద్ది సాధ్యం
ధరణితో వేల ఎకరాలు మాయం
జమ్మికుంట సభలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌
కరీంనగర్‌,అక్టోబర్‌16: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో సోమవారం బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ’ధరణి’ పోర్టల్‌ ద్వారా తెలంగాణలో లక్షల ఎకరాలు మాయం చేశారని రాజ్‌ నాథ్‌ ఆరోపించారు. అదే మోదీ తీసుకొచ్చిన ’భూ స్వామిత్ర’ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ భూ హక్కులు ఇచ్చామని, శాటిలైట్‌ ఆధారంగా హద్దులు నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే లాభ పడిరదని, కల్వకుంట్ల కుటుంబ అవినీతి ఢల్లీి వరకూ చేరిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రైవేట్‌ లిమిటెడ్‌ గా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ఒక్కరే పోరాడలేదని, బీజేపీ కూడా పోరాడిరదని రాజ్‌ నాథ్‌ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ’బీఆర్‌ఎస్‌ కారు.. బేకారు’ అవుతుందని, అధికారం లేకుండా కేసీఆర్‌ ఉండలేరని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ప్రజలు హ్యాండ్‌ ఇవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. కమలం గుర్తుకు ఓటేస్తే అంతా మంచే జరుగుతుందని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌ తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని, అయితే ఆ పార్టీ వైఫల్యంతోనే ఇరు రాష్టాల్ర మధ్య సమస్యలు నెలకొన్నాయని రాజ్‌ నాథ్‌ విమర్శించారు. బీజేపీ ఇచ్చిన 3 ప్రత్యేక రాష్టాల్రు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని చెప్పారు.
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని రాజ్‌ నాథ్‌ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ హయాంలో పేదలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు పీఎం ఆవాస్‌ యోజన కింద ఇల్లు కట్టించి ఇచ్చినట్లు చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీదేనని అన్నారు. 27 ఏళ్లుగా గుజరాత్‌ లో బీజేపీ అధికారంలో ఉందని, అభివృద్ధికి రోల్‌ మోడల్‌ గా నిలిచినట్లు చెప్పారు. పదేళ్లుగా తెలంగాణలో అభివృద్ధి ఎందుకు జరగలేదో కేసీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు.?. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను రాజ్‌ నాథ్‌ కోరారు. ఈ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సహా ఇతర నేతలూ పాల్గొన్నారు.