తెలంగాణలో ‘లులు’ రూ.3,500 కోట్ల పెట్టుబడులు
` సంస్థ మాల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో యావత్ దేశానికి దిక్సూచిగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ లులు గ్రూపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.కూకట్‌పల్లిలో లులు గ్రూపు ఏర్పాటు చేసిన మాల్, హైపర్ మార్కెటింగ్ సెంటర్‌ను ఆ సంస్థ ఛైర్మన్ యూసుఫ్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లులు సంస్థకు అభినందనలు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సరళీకృతమైన విధానాల వల్ల.. లులు గ్రూపు రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. అందులో భాగంగా రూ.300 కోట్లతో మాల్‌తోపాటు హైపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేసిందని, త్వరలోనే సూపర్ మార్కెట్‌లు, మాల్స్, పుడ్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లలో కూడా లులు గ్రూపు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వివరించారు. తద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధితోపాటు ఆక్వా, పౌల్ట్రీ రైతులకు లబ్ధి చేకూరుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు లులు గ్రూపు ఛైర్మన్ యూసుఫ్ అలీ ప్రకటించారు.