తెలంగాణలో సర్కారీ పెద్దాసుపత్రులు
– నిర్మాణానికి ముందుకొచ్చిన నెదర్లాండ్స్ సంస్థ
హైదరాబాద్,ఏప్రిల్ 21(జనంసాక్షి): గతంలో ప్రకటించిన మేరకు కొత్త ఆసుపత్రుల నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. ఆసుపత్రుల నమూనా రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలని, నూతన ఆసుపత్రుల నిర్మాణం రెండేళ్లలో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, ఖమ్మంలలో ప్రభుత్వం నూతనంగా నిర్మించతలపెట్టిన పెద్ద ఆస్పత్రుల భవనాల నిర్మాణానికి నెదెర్లాండ్స్‌కు చెందిన రాబో బ్యాంకు ముందుకు వచ్చింది. ఈమేరకు శుక్రవారం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును రాబో బ్యాంకు ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. కొత్త ఆస్పత్రుల నిర్మాణం త్వరితగతిన పూర్తికావాలన్నారు. వ్యాప్కోస్ సాంకేతిక సహకారంతో డిజైన్లను రూపొందించాలని సూచించారు. వీలైనంత త్వరలో టెండర్ల పక్రియ పూర్తిచేయాలన్నారు. నగరంలో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల తరహాలో మొదటి దశలో మూడు పెద్దాసుపత్రులు నిర్మించాలని అన్నారు. ఒక్కో ఆస్పత్రిలో 750 పడకలు ఏర్పాటు చేయాలని సూచించారు. 250 పడకలను మహిళలు, చిన్న పిల్లలకు కేటాయించాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రి టవర్స్‌ను కూడా వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించాలని తెలిపారు. కరీంనగర్, ఖమ్మంలో ఒక్కో ఆస్పత్రిలో 5 వందల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి భవనాలను నిర్మించాలన్నారు. కొత్త ఆస్పత్రుల్లో 4250 పడకల సామర్థ్యం వస్తుందని పేర్కొన్నారు. శ్రీలంకతోపాటు పలు ప్రాంతాల్లో పెద్దాసుపత్రులు నిర్మించిన అనుభవం రాబో బ్యాంకుకు ఉంది. హైదరాబాద్‌లో మొదటి దశలో గాంధీ, ఉస్మానియా తరహాలో 3 పెద్దాసుపత్రులు నిర్మించాలని వివరించారు. ఒక్కో ఆసుపత్రిలో 750 పడకలు ఏర్పాటు చేయాలని అన్నారు. రోబో బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆసుపత్రుల నిర్మాణంలో పాలుపంచుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తో పాటు పలవురు అధికారులు పాల్గొన్నారు.




