తెలంగాణే పెట్టుబడులకు అనుకూలం
– 17 కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,జూన్23(జనంసాక్షి):
రాష్ట్రం పెట్టుబడులకు అనుకూల ప్రాంతమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత ఇవాళ ఆయన తొలిసారిగా 17 పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పత్రాలను యజమానులకు అందజేశారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీలను ఆయన అభినందించారు. త్వరితగతిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేసిన సీఎంకు కంపెనీల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం పారిశ్రామికాబివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, ఈ సానుకూలతను ఉపయోగించుకోవాలని సీఎం కోరారు. రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామిక వేత్తలు భాగస్వాములు కావాలని అన్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్ట స్థితికి తీసుకుపోయే లక్ష్యంతో సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పిస్తుందని వెల్లడించారు. పరిశ్రమలకు అనుమతులను కూడా సరళతరం చేస్తామన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పరిశ్రమల విభాగాన్ని చూసే అధికారులు చాలా వేగంగా పనిచేశారని కితాబిచ్చారు.