తెలంగాణోళ్లకు తెలివిలేదన్నరు
– పాలన చేతకాదని ఎద్దేవా చేశారు
– ఇప్పుడు ఏపీలో మేమిచ్చినట్లు 24గంటల కరెంట్ ఉందా?
– మహారాష్ట్రలోని 40గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని లేఖరాశారు
– అలాంటి అద్భుత పాలన అందిస్తున్నాం
– మళ్లీ దానిని ఆంధ్రాళ్లో చేతులో పెట్టొద్దు
– ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలి
– బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇస్తాం
– నిర్మల్ సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్
నిర్మల్, నవంబర్22(జనంసాక్షి) : రాష్ట్రంలోని బీడీ కార్మికులందరికీ పీఎఫ్ కటాఫ్ డేట్ తీసేసి అందరికీ పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ హావిూ ఇచ్చారు. గురువారం నిర్మల్ పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. 48 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి సమయం చాలలేదా.. 10 ఏళ్లు పాలించిన టీడీపీకి సరిపోలేదా.. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరెంట్ ఏవిధంగా ఉండేది.. ఇప్పుడు ఏవిధంగా ఉందని కేసీఆర్ ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి కరెంట్ రాదు.. ఆగమాగం అయితదని చెప్పిండని, విూ తెలంగాణోళ్లకు తెలివి లేదని, పరిపాలన చేసుకోలేరని అన్నాడని కేసీఆర్ గుర్తుచేశారు. నాలుగేళ్లయిపోయిందని, మా అంత గొప్పోడు లేడు అన్న ఏపీలో 24గంటల కరెంట్ ఉన్నదా అని కేసీఆర్ ప్రశ్నించారు. క్వాలిటీ కరెంట్, మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలుతలేవు ఇక్కడ. 24 గంటల పవర్.. అన్ని వర్గాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ.. గర్వంగా, సంతోషంగా తెలియజేస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఇంకా చాలా విషయాల్లో ముందున్నామని, చంద్రబాబు అయితే.. హైదరాబాద్ నేను కట్టిన అంటుండని, కులీకుత్‌బ్‌షా ఏం చేసిండు మరి.. కాంగ్రెస్ ఘనాపాటీలు ఏం చేశారని ప్రశ్నించారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల, ఆరోగ్య లక్ష్మీ, గర్భవతులకు ఇప్పుడు ఎలా ఉంది.. అప్పుడు ఎలా ఉందో విూకు తెలుసని అన్నారు. కేసీఆర్ కిట్ వచ్చాక ఆరోగ్య భద్రత పెరిగింది.. ఇవన్నీ విూరు చూస్తున్నారు కదా అని ప్రజలను కేసీఆర్ అడిగారు. కళ్యాణ లక్ష్మీ అనే పథకం ఇండియాలో ఎక్కడన్నా ఉన్నదా.. మహారాష్ట్రలో ధర్మాబాద్‌లో 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని లేఖ రాశారని కేసీఆర్ అన్నారు. ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పనివి.. ఎన్నికల్లో హావిూ ఇవ్వనివి కూడా అమలు చేస్తున్నామన్నారు. నిర్మల్‌లో 66829 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారని, వీళ్లంతా ఓట్లేసినా ఇంద్రకరణ్‌రెడ్డి గెలుపు పక్కా అవుతుందని కేసీఆర్ అన్నారు. నిర్మల్ కు రైలు రావాలని, మెడికల్ కాలేజీ రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి కలిసి పట్టుబట్టి ఆదిలాబాద్ ను నాలుగు జిల్లాలు చేయాలని నన్ను కోరారని, గిరిజనుల సమస్యలు, పోడు భూముల సమస్యలు ఉన్నాయని, తెలంగాణ అంతటా భూగర్భ డ్రైనేజీ రావాలని అన్నారు. అసదుద్దీన్ నిర్మల్ సభకు రాకుండా చూస్తే.. 25 లక్షలు ఇస్తానని కాంగ్రెస్ నేత స్థానిక ఎంఐఎం నేతకు ఆఫర్ చేశాడని, 25లక్షలు కాదు కదా… 25కోట్లు ఇచ్చినా అసదుద్దీన్ ను కొనలేరుని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చిల్లర పనులు చేయొచ్చా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇంద్రకరణ్ రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.