తెలంగాణ అభివృద్ది మరింత వేగం కావాలి
నిరంతర విద్యుత్ కొనసాగాలి
ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావాలి
అందుకు మళ్లీ టిఆర్‌ఎస్ అధికారంలోకి రావాలి
ప్రచారంలో సోమారపు పిలుపు
రామగుండం,నవంబర్26(జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరవాత గత నాలుగేళ్ల అభివృద్దిని చూపి ప్రజలు టిఆర్‌ఎస్‌ను మరోమారు ఆదరించి సిఎంగా కెసిఆర్‌ను చేయాలని రామగుండం టిఆర్‌ఎస్ అభ్యర్తి సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, నిరంతరాయ విద్యుత్ కొనసాగాలన్నా టిఆర్‌ఎస్ మరోమారు అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు చాలా కీలకమైనవన్నారు. మహా కూటమి నాయకులు చెప్పిన మాయ మాటలను నమ్మి ఓటేస్తే మరో ఐదేండ్లు రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కుంటు పడుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్‌పై అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలతో అందరికీ న్యాయం జరిగిందన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు చేరాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే టీఆర్‌ఎస్ పార్టీ ప్రచార అస్త్రాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయన్నారు. వివిధ ప్రాంతాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. ఆంధ్రా బాబు కనుసన్నల్లో పాలన కొనసాగిస్తారన్నారు. తెలంగాణలో ఆంధ్రా నాయకుల పెత్తనం చెల్లదన్నారు. ఇప్పటికే తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసి అడ్డుకుంటున్నారన్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎన్నికలప్పుడు ఇంటింటికీ తిరిగి నాలుగు మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు వినే స్థితిలో లేరన్నారు.కేసీఆర్‌తోనే అభివృద్ధి జరుగుతుందని అనేకులు గుర్తించి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాలుగు సంవత్సరాల్లో ప్రజలు కోరుకున్న పాలననే కేసీఆర్ అందించారన్నారు. మరోసారి అధికారం ఇస్తే ఆసరా పింఛన్లను రూ.1000 నుంచి రూ.2016కు పెంచుతామన్నారు. రైతు బంధు ఆర్థిక సాయాన్ని ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని అన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు ప్రతినెల రూ.3016 నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా తమకు కేసీఆర్ అమలు చేసిన పథకాలతో ఎంతో సాయం అందుతుందని చెబుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకే మద్దతు పలుకుతామని స్వచ్చందంగా ముందుకు వస్తున్నారన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలందరూ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాలని సూచించారు.