తెలంగాణ అభివృద్ధికి నిధులు విడుదల చేయండి
– నీత్ అయోగ్ ఉపాధ్యక్షుడితో సీఎం కేసీఆర్
హైదారబాద్,జులై2(జనంసాక్షి):
రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులు సమకూర్చే బాధ్యతను నీతి ఆయోగ్ తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. తిరిగి వాటిని చెల్లించడానికి కూడా రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా హైదరాబాద్ బేగంపేటలోని అధికార నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా కేసీఆర్ ఈ ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పథకాల నిర్వహణ, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు. గతంలో నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రణాళికా సంఘం నిధులు మంజూరు చేసేదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నిధులివ్వాలని, మళ్లీ వాటిని వడ్డీతో పాటు రాష్ట్రాల నుంచి తీసుకోవాలని సూచించారు. దీనివల్ల నీతి ఆయోగ్ కూడా బలోపేతం అవుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, హరితహారం తదితర పథకాల గురించి అరవింద్ కు సీఎం కేసీఆర్ వివరించారు. నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు, ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానంతో పాటు తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లాంటి కార్యక్రమాలను అరవింద్ పనగారియా అభినందించారు. కేంద్రం వద్ద మూలుగుతున్న క్యాంపా నిధులను వాటా ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. విభజన బిల్లులో హావిూ ఇచ్చిన విధంగా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఎఫ్‌ఆర్‌బిఎమ్ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలన్నారు. ముఖ్యమంత్రి చేసిన వినతుల పట్ల పనగారియా సానుకూలంగా స్పందించారు.ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జిఆర్.రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు ప్రదీప్ చంద్ర, బిపి.ఆచార్య, నర్సింగరావు, ఎం.జి.గోపాల్, సోమేష్ కుమార్, రాజేశ్వర్ తివారి, ఎస్ కె.జోషి, రేమండ్ పీటర్, శాంతకుమారి, స్మితా సబర్వాల్, నీతి ఆయోగ్ అధికారులు తపస్య, ఎ.కె.జైన్ పాల్గొన్నారు.