తెలంగాణ అమరునికి అంతిమ వీడ్కోలు
రాయికల్, జూలై 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ నాన్చుడు ధోరణిపై నిరాశచెంది బుధ వారం ఆత్మబలిదానం చేసుకున్న రాయికల్ మండల కేంద్రానికి చెందిన రాజారపు జనార్దన్ మృతదేహానికి గురువారం నిర్వహించిన శవయాత్రలో ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. బోరున వర్షంకురుస్తున్న వర్షాన్ని లెక్కచేయ కుండా చివరివరకు శవయాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు. తెరాస ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్, రాయికల్ మాజీ జెట్పీటీసీ రామాదేవి, టీఆర్ఎస్ నాయకులు భూమాగౌడ్ మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులలు అర్పించారు. ఈ సందర్భంగా మృతుడి భార్యకు తెరాస పార్టీ తరపున తక్షణ సహాయం కింద 10వేల రూపాయల నగదును పార్టీ తరపున ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్లు ఆర్థిక సహా యాన్ని అందజేశారు.
కల్వకుంట్ల విద్యాసాగర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాన్ని తెలంగాణ ప్రజలు హర్షించడంలేదన్నారు. తెలంగాణకు మద్దతు ప్రకటించని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లలో నిర్వహించిన కార్య క్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 10వేల మంది పోలీసుబలగాల మధ్య రెడ్‌కార్పెట్ పరచి విజయవంతమయ్యేలా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించి తెలంగాణపై తమ వైఖరేమిటో తెలిపిందన్నారు. సీమాంధ్ర నేతల పదవులు ఆస్తులు కాపాడుకోవడానికి తెలంగాణకు అడ్డుపడుతున్నారని ఆయ న మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంలో కేంద్రం చేస్తున్న జాప్యం కారణంగానే ఈ ఆత్మబలిదానాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బలిదానాలతో కాకుండా ఉద్యమాలతోనే సాధ్యమని అన్నారు. మృతుడి కుటుంబాన్నిఅన్నివిధాలుగా తెరాసపార్టీ తరపున ఆదుకుంటామని తెలుపుతూ సంతాపాన్ని తెలియజేశారు.