తెలంగాణ అసెంబ్లీలో రగడ..
– నిరుద్యోగ అంశంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులు
– అధికార, ప్రతిపక్షాల సభ్యుల నడుమ వాగ్వివాదం
– కిషన్‌రెడ్డిపై ఆగ్రహంవ్యక్తంచేసిన మంత్రులు కడియం, కేటీఆర్
– బీజేవైఎం నేతల అరెస్టులకు నిరసనగా భాజపా వాకౌట్
– పబ్లిసిటీ కోసం రచ్చచేయడం సరికాదు
– నిరుద్యోగ సమస్యపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నాం – సీఎం కేసీఆర్
హైదరాబాద్,నవంబర్7(జనంసాక్షి) : ఉద్యోగాల భర్తీ అంశం అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. మంగళవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే.. నిరుద్యోగ అంశంపై చర్చకు పట్టుబడుతూ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ఉద్యోగాల భర్తీపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు కోరగా.. స్పీకర్ ఇందుకు అనుమతించలేదు. ఈ అంశంపై అధికార-ప్రతిపక్షాల వాగ్వాదంతో గందరగోళం నెలకొంది. నిరుద్యోగ అంశంపై నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పీకర్‌ను కోరారు. సభ నడిచేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం నుంచి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉదయం బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ రోజు మా (గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి కొరత)క్వశ్చన్ వాయిదా వేసుకుంటున్నాం అని చెప్పడంతో ఆయన సభకు రావట్లేదనుకున్నా.. కానీ సభకు వచ్చి మొదట ప్రశ్నవిూదై ఉండి వాయిదా వేసుకుని మరీ ఇలా గోలచేయడమేంటని కిషన్ రెడ్డిని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమైన సమస్యపై క్వశ్చన్ ఇచ్చి.. మాట్లాడకుండా సభలో చర్చకు రాకుండా రచ్చకు రావడం ఇది ఏరకమైన నీతి అని బీజేపీ ఎమ్మెల్యేలను ఆయన ప్రశ్నించారు. భాగ్యనగరంలో నీటి సమస్య లేదు కనుకనే.. వారికి ఏం అడగాలో ధైర్యం లేక ప్రశ్నను వాయిదా వేసుకున్నారని కేటీఆర్ చెప్పారు. ఉద్యోగ కల్పనవిూద ప్రభుత్వం సావధానంగా చర్చకు సిద్ధంగా ఉందని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఈ గందరగోళం నడుమ తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. డిప్యూటీసీఎం కడియం శ్రీహరి కలుగజేసుకొని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై మండిపడ్డారు. బీఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా.. సభ్యులు సభకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు కడియం. ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంబడే.. బీజేపీ మొదటి ప్రశ్నను వాయిదా వేసుకుని గొడవ చేయడమేంటని ప్రశ్నించారు. సభకు రానప్పుడు ప్రశ్నను వాయిదా వేసుకోవడం
జరుగుతుంది కానీ.. సభకు వచ్చి ప్రశ్నను వాయిదా వేసుకోవడం సరికాదన్నారు. ప్రశ్నోత్తరాల తర్వాత నిరసన వ్యక్తం చేసుకోవచ్చుని సూచించారు. సభకు ఆటంకం కలిగించడం భావ్యం కాదు.. మంచిపద్ధతి కాదని కడియం శ్రీహరి అన్నారు. స్వల్ప కాలిక చర్చకు అనుమతిచ్చినా.. బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంపై డిప్యూటీ సీఎం మండిపడ్డారు. సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి వేరే సభ్యుడి వద్దకు వెళ్లి మైక్ తీసుకోని మాట్లాడనివ్వడం సరికాదన్నారు కడియం. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేవైఎం కార్యకర్తల అరెస్టు నిరసనగా బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నడుస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని, సభ్యులు గొడవ చేస్తున్నా.. సభను నడపటం సరికాదని ఆయన అన్నారు. సభ్యులు ఆందోళన చేస్తూ.. గందరగోళం సృష్టిస్తున్న పట్టించుకోవడం లేదని, సభ ఆర్డర్‌లేని సమయంలో సభను వాయిదా వేయాలని, కానీ చూస్తూ ఊరుకోవడం సరికాదని అన్నారు. ఇలాటి సభలో తాము ఉండమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని స్పీకర్ కాపాడాలని ఆయన కోరారు. బీజేపీని చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.
నిరుద్యోగ సమస్యపై చర్చకు సిద్ధం – సీఎం కేసీఆర్
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో బీజేపీ సభ్యులు నిల్చొని నిరసన తెలుపడంతో.. సీఎం కేసీఆర్ స్పందించారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని.. ఆ క్రమంలో ప్రతీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. శాసనసభలో తమ గొంతు వినిపించే అవకాశం లేని వారు ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తారని సీఎం తెలిపారు. ఛలో అసెంబ్లీ అని వస్తే సీఎం లేదా సంబంధిత శాఖ మంత్రులు లేదా కొన్ని పార్టీ నేతలు కలిసి నిరసన తెలిపే వారి వద్దకు వెళ్లి రిప్రజేంటేషన్ తీసుకునే వాళ్లని సీఎం గుర్తు చేశారు. అవసరమైతే గన్‌పార్క్ లేదా పబ్లిక్‌గార్డెన్ సవిూపంలో వారితో మాట్లాడేదని తెలిపారు. సమస్యలు ఉంటాయి.. వాటికి పరిష్కారాలు ఉంటాయని సీఎం తెలిపారు. పబ్లిసిటీ కోసం రచ్చ చేయడం సరికాదని సీఎం సూచించారు. గతంలో అంగన్‌వాడీ కార్యకర్తలపై లాఠీచార్జి జరగడం.. అప్పట్నుంచి ప్రభుత్వాలు నిషేధాజ్ఞలు అమలు చేయడం వస్తుందన్నారు. ఏబీవీపీ, బీజేవైఎం తలపెట్టిన చలో అసెంబ్లీ తన దృష్టికి వచ్చిందన్నారు సీఎం. ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. బీజేపీ సభ్యులు కూర్చొని సభకు సహకరించాలని సూచించారు. శాంతి భద్రతల కోసమే బీజేవైఎం నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.