తెలంగాణ ఆకాంక్షల కోసమే జట్టుకట్టాం

మ్మడి కార్యాచరణ వేగవంతం చేయాలని కోరాం

పొత్తులో భాగంగా 17 సీట్లు కోరాం

రాహుల్‌తో భేటీ అనంతరం కోదండరామ్‌ వెల్లడి

న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో కలసి నడవాలని నిర్ణయించామని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్‌ అన్నారు. మనం కోరుకున్న తెలంగాణ రాలేదని, వచ్చిన తెలంగాణ బందీ అయ్యిందన్నారు. తెలంగాణలో ఏర్పాటైన మహాకూటమిలో పార్టీలకు సీట్ల కేటాయింపు అంశం తుది అంకానికి చేరిన క్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పిలుపుతో తెజస అధ్యక్షుడు కోదండరాం దిల్లీ వెళ్లారు. ఆయనతో జరిగిన భేటీలో సీట్ల కేటాయింపుతో పాటు తెలంగాణలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహం, భవిష్యత్తు కార్యాచరణపై ప్రధానంగా చర్చించారని సమాచారం. మరోవైపు కోదండరాం 15 సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో రాహుల్‌తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్‌తో భేటీ అనంతరం మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్‌తో కలసి కోదండరామ్‌ విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో కలసి పోటీచేయాలని నిర్ణయించామని అన్నారు. కలలుగన్న తెలంగాణ సాధనే లక్ష్యంగా మహాకూటమితో కలిసి ముందుకెళ్తున్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం చెప్పారు. దిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆయన భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం కొనసాగింది. కూటమి ఏర్పాటుపై రాహుల్‌గాంధీతో చర్చించానని, ఉమ్మడి కార్యాచరణ వేగవంతం చేయాలని ఆయన్ను కోరినట్లు చెప్పారు. కలిసి వచ్చే శక్తులతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్‌ తెలిపారన్నారు. కూటమి ఏర్పాటు ఆలస్యమైతే అన్ని పార్టీలకు నష్టం జరిగే అవకాశముందని, ఇదే విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్లినట్లు కోదండరాం చెప్పారు. కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు రాహుల్‌ సూచించారని కోదండరాం వివరించారు. సీట్ల గురించి కూటమిలోని పార్టీల మధ్య చర్చలు పూర్తి కావడం లేదని కోదండరాం చెప్పారు. తాము 17 సీట్లు కోరామని.. 15 స్థానాల్లో పోటీ చేయగలమనే ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. కూటమి ఏర్పాటు, సీట్ల పంపకాలు వేర్వేరు అంశాలని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారం కోసం కూటమిగా ఏర్పడితే ప్రయోజనం ఉండదని, లక్ష్య సాధనకోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఏ నిరంకుశ పాలన వద్దనుకున్నామో అలాంటి పాలనకు కృషి చేస్తున్నామన్నారు. పార్టీ నిర్మాణం లేకుండా సీట్లు అడగటం లేదని, పార్టీ పరిస్థితి బాగున్న స్థానాలు కోరుతున్నట్లు కోడండరాం చెప్పారు. సుమారు 25 చోట్ల తెజస బలంగా ఉందని ఆయన తెలిపారు. కూటమి ఏర్పాటు ఆవశ్యకతను బలంగా ప్రజలకు వివరించాలని భావిస్తున్నామన్నారు. వ్యక్తులే కేంద్రంగా పొత్తులు ఉండకూడదనే తన అభిప్రాయమని కోదండరాం చెప్పారు. ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీలో ఉంటారని విూడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆ విషయం అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. తన పోటీ విషయంపై హైదరాబాద్‌ చేరుకున్నాక చెప్తానన్నారు. కూటమిలోని సీట్ల సర్దుబాటుపై తేలితే మిగతా విషయాలన్నీ నిర్ణయిస్తామని అన్నారు. సీట్ల కేటాయింపుపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేసిన 95, 24 స్థానాల ప్రకటనపై తనకు తెలియదని వ్యాఖ్యానించారు. చర్చలు పరిష్కారం కాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమాజంలో తాము అనుకున్న మార్పు తీసుకురావాలంటే రాజకీయప్రవేశం తప్పనిసరైంది కోదండరాం వివరించారు. తెలంగాణ

ఇచ్చిన కాంగ్రెస్‌నే అవమానించారని, కుటుంబ పాలనకు తెర తీసరాని సిఎం కెసిఆర్‌పై మధుయాష్కీ మండిపడ్డారు. తెలంగాణ బాగుపడుతుందని నమ్మి సోనియా ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకున్నారని అన్నారు. విూడియా సమావేశంలో దిలీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గాను 95 స్థానాల్లో కాంగ్రెస్‌, 14 స్థానాల్లో తెదేపా పోటీచేస్తాయని దిల్లీలో కాంగ్రెస్‌ నేతలు ఆర్‌సీ కుంతియా, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టంచేసిన విషయం తెలిసిందే. మిత్రపక్షాలైన తెజస, సీపీఐలకు పది స్థానాలు కేటాయిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.