తెలంగాణ ఆదాయం రెట్టింపవుతుంది

– ఫుడ్‌ప్రాసెసింగ్‌ పాలసీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌
న్యూఢిల్లీ,నవంబర్‌ 4,(జనంసాక్షి): తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ తొలిస్థానంలో ఉందని, పరిశ్రమల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.  ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా సదస్సులో శనివారం కేటీఆర్‌ మాట్లాడారు. అనుమతులు మంజూరు చేయని అధికారులకు రోజుకు వెయ్యి చొప్పున జరిమాన విధించేలా విధానం రూపొందించామని స్పష్టం చేశారు. తెలంగాణ రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని నీతి ఆయోగ్‌ సహా పలు స్వదేశీ, విదేశీ సంస్థలు, ప్రభుత్వాలు అభినందించాయి. తెలంగాణ రాష్ట్రం సీడ్‌ బౌల్‌గా పేరుగాంచిదని, ఎటువంటి ప్రకృతి పైపరిత్యాల నుంచి ముప్పులేదని ఆయన తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలత ఉందని ఆయన పేర్కొన్నారు.  భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, ఆర్థికంగా రైతుల విూద ఆధారపడుతుందని, ఇలాంటి దేశంలో ఆహార పరిశ్రమల వల్ల రైతులు లాభపడేలా చూడాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల ఏడాది సగటు ఆదాయం లక్షా 28 వేలు ఉన్నదని, మరో అయిదేండ్లలో దాన్ని రెట్టింపు చేయనున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. ఈ అంశం కొందరికి నమ్మశక్యం కాకపోయినా తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. ఆ లక్ష్యాలను అందుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా సంసిద్ధంగా ఉందన్నారు. జలవనరుల ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆహార పరిశ్రమల ఏర్పాటు ద్వారా కూడా రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. క్షీర విప్లవం ద్వారా కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నట్లు చెప్పారు. ఈ-నామ్‌లోనూ తెలంగాణ నెంబర్‌ వన్‌ ఉందన్నారు. రాష్ట్రంలో 84 వ్యవసాయ మార్కెట్లకు ఈ-నామ్‌ కనెక్షన్‌ ఉందన్నారు. పారదర్శకమైన మార్కెటింగ్‌ వ్యవస్థతో దళారీలను రూపుమాపుతామని కేటీఆర్‌ అన్నారు. ఫుడ్‌ ప్రొసెసింగ్‌ రంగాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేసి, రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని అందుకునేలా ఈ పాలసీ రూపొందించామన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణి, గొర్రెల పంపిణి కార్యక్రమాలను పుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి అనుసంధానం చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు పెంచుతామన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడంతో పాటు, గొర్రెల పెంపకం(లైవ్‌ స్టాక్‌) లో రాబోయే ఐదేళ్లలో దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా మారేందుకు ఈ పాలసీ సహకరిస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రానికి భౌగోళికంగా ఉన్న అనుకూలతల వలన దేశ ఆహరోత్పత్తుల రవాణా హబ్‌ గా మారుస్తామన్నారు కేటీఆర్‌. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ ద్వారా సుమారు 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రావడంతో పాటు, లక్ష 25 వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ద్వారా వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల నాణ్యతలో దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపుతామని మంత్రి తెలిపారు. దీంతో పాటు అగ్రి, ఫుడ్‌ వాల్యూ చైన్‌ నిర్మించడమే లక్ష్యంగా పని చేస్తామని వివరించారు.పాలసీ ఆవిష్కరణ సందర్భంగా విజ్ఞాన్‌ భవన్‌ లో జరిగిన సమావేశానికి హాజరైన పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని మంత్రి హావిూ ఇచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇచ్చేటటువంటి సబ్సిడీలను, ప్యాకేజీల వివరాలను తమకందిస్తే? అంతకు మించిన అవకాశాన్ని తాము కల్పిస్తామని పెట్టుబడిదారులకు మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, అనుమతుల ప్రక్రియ వంటి అంశాలను మంత్రి వారికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోని అవకాశాలను మంత్రి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం రంగం మరింత అభివద్ధి చెందుతుందన్న మంత్రి, వ్యవసాయ అనుబంధంగా చేపట్టిన కార్యక్రమాలను సైతం వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లో వ్యవసాయోత్పత్తుల స్టోరేజీ సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచినట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ ద్వారా ఆ రంగంలోని పెట్టుబడిదారులకు అందించే రాయితీలు పాలసీలోని ముఖ్యాంశాలను మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా వివరించారు. ఈ పాలసీ వచ్చే ఐదేళ్లు అమలులో ఉంటుంది.రాబోయే ఐదేళ్లలో 20 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వస్తాయి.లక్షా 25 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు. రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు.ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెలు, చేపల పెంపకం వంటి కార్యక్రమాలను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమతో అనుసంధానం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వ్యవసాయ ? ఆహార ఉత్పత్తుల వాల్యూ చైన్‌ ఏర్పాటు. ఇందుకోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్లు, ఫుడ్‌ పార్కుల అభివృద్ధి.సగటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ స్థాయిని కనీసం 20 శాతం పెంచడం.జాతీయ స్థాయిలో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రంగా తెలంగాణను మార్చడం. ఈ పాలసీలో భాగంగా స్టార్ట్‌ అప్స్‌ కోసం అగ్రిటెక్‌ నిధి ఏర్పాటు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఇన్నోవేషన్‌ మరియు, ఆదర్శ విధానాల ప్రమోషన్‌.
13 కంపెనీలతో ఒప్పందాలు..
వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా ఈవెంట్‌లో తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలతో 13 ఒప్పందాలను కుదుర్చుకున్నది. గత రెండు రోజులుగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోకి సుమారు రూ.7200 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆహార పరిశ్రమలతో జరిగిన ఒప్పందాల పట్ల మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. మునుముందు మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందు వస్తాయని విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు.