తెలంగాణ ఇస్తరా ! లడాయితోనే లాక్కోమంటరా ?
సత్వరం తెలంగాణ ప్రకటించకుంటే ఉద్యమం ఉధృతస్థాయిలో
జేఏసీ చైర్మన్ కోదండరాం
మార్చ్ సన్నాహకర్యాలి విజయవంతం
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (జనంసాక్షి):
తెలంగాణ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ నెల 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్ సందర్భంగా టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో సన్నాహక ర్యాలీ నిర్వహించారు. మాణికేశ్వరీనగర్ నుంచి బయలు దేరిన ఈ ర్యాలీ సికింద్రాబాద్ వరకు సాగింది.ఈ ర్యాలీ సందర్భంగా జేఏసీ చైర్మన్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే నని అన్నారు. ఈ నెల 30న తెలంగాణ మార్చ్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా చూడొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం తెలంగాణను ప్రకటించాలని, లేదంటే ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 30లోగా కేంద్రం స్పందించి తెలంగాణ ప్రకటిస్తే విజయోత్సవ సంబరాలు జరుపుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రకటించకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతంలో గ్రామగ్రామాన ప్రజలు ఉద్యమించేందుకు ఎక్కడికక్కడా సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆగ్రహం చవిచూడకముందే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఈ ర్యాలీకి భారీ ఎత్తున తెలంగాణవాదులు తరలివచ్చారు. ఈ ర్యాలీ కారణంగా పట్టణంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.