తెలంగాణ ఉద్యమంలో ముస్లింల పాత్ర కీలకం
సీఎం 12 శాతం రిజర్వేషన్ హామీ నెరవేర్చాలి
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 9(జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమంలో ముస్లింల పాత్ర కీలకమని, ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ”ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, ఉద్యమంలో ముస్లింల పాత్ర” అన్న అంశంపై బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సీఎం కేసీఆర్ ముస్లింలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలనిడిమాండ్ చేశారు. సదస్సులో పాల్గొన్న పౌరహక్కుల నేత ప్రొ.హరగోపాల్, జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తదితర వక్తలు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం తక్షణం గుర్తించాలని, వెంటనే రిజర్వేషన్లు అమలు పరచాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడానికి ముస్లింల పాత్ర పెంచే క్రమంలో ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ తెలంగాణలో .. అత్యధికంగా ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని అనేక సార్లు ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఎన్నికల సమయంలో 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని కేసీఆర్ వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం గడిచిపోయినా.. మూడు నెలల్లో అమలు చేస్తానన్న 12 శాతం రిజర్వేషన్‌ను ఎందుకు అమలు చేయటం లేదని వక్తలు ప్రశ్నించారు. సామాజిక సమానత్వాన్ని సాధించే క్రమంలో రిజర్వేషన్ ఒక సాధనంగా పనిచేస్తుందన్నారు.
తెలంగాణలో ఉన్న ముస్లింలు కడు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అత్యంత వెనకబాటుకు గురయ్యారని, ప్రజాస్వామ్య ప్రకియలో ముస్లింలను భాగస్వాములను చేయాలంటే అభివృద్ధికి తోడ్పడే రిజర్వేషన్లు అత్యవసరమని వక్తలు వ్యాఖ్యానించారు. స్వాతంత్రంకంటే పూర్వమే బ్రిటిష్ కాలంలోనే ముస్లింలకు రిజర్వేషన్లు వుండేవని, ఆనాడే అనేకమంది సామాజిక ఉద్యమకారులు రిజర్వేషన్ల ప్రాధాన్యతను గుర్తించి అమలు చేశారని వక్తలు అన్నారు. స్వాతంత్రం సందర్భంగా పాకిస్తాన్ విడిపోయినప్పుడు అభద్రతా భావంలో వున్న ముస్లింలు, స్వాతంత్రానంతరం గతంలో వున్న ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయాలని వెల్లడించలేకపోయారు. దీన్ని ఆసరా చేసుకున్న నాటి సర్కారు రిజర్వేషన్లు తొలగించింది. స్వతంత్ర భారతంలో మైనారిటీలుగా అత్యంత వెనుకబడిన వర్గంగా వున్న ముస్లింలకు.. వారి అభివృద్ధికి తోడ్పడే రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినా .. హిందుత్వ శక్తులకు భయపడి కుహనా లౌకిక వాదాన్ని వల్లించే పార్టీకి వత్తాసు పలకడం వల్లనే రిజర్వేషన్ల ప్రక్రియ ఆగిపోయింది.
ఇప్పటికైనా.. సమాజంలో అభద్రతాభావానికి లోనవుతూ.. బతుకుదెరువు కరువై అన్ని రంగాల్లో వెనుకబడిన మైనారిటీలకు రిజర్వేషన్ ద్వారా కొంతనైనా అభివృద్ధికి తోడ్పడే దిశగా ప్రాధాన్యతనివ్వకపోవడం వల్లనే.. బతుకుదెరువులేని ముస్లిం యువత దారితప్పుతుందనే వాస్తవాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని ముస్లిం మైనారిటీకి చెందిన వక్తలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తన వాగ్దానాన్ని ఇప్పటికైనా నెరవేర్చకుంటే మరో ఉద్యమానికి సన్నద్ధమవుదామని వక్తలు పిలుపునిచ్చారు. మొట్టమొదట ఆర్డినెన్సు ద్వారా అమలు చేయాలని వారు కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల లోపే 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ముస్లిం మేధావులు ప్రకటించారు. అంచెలంచెలుగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ద్వావర, ఉద్యమాల ద్వారా, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వాళ్లు ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇకనుంచి సమాజంలోని అన్ని శక్తుల్ని కలుపుకుని మద్దతు కూడగట్టుకునేందుకు ముందుకెళ్తామన్నారు.