తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : నాడు భూస్వాములకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిళ్లే అన్నారు.వీర వనిత చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా శనివారం స్థానిక మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహం వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, వామపక్షాల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని కొనసాగించాలన్నారు.నేడు కుల వృత్తులు అంతరించి ఆయా కులాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి వృత్తిని హామీగా పెట్టుకొని బ్యాంకులలో రుణ సౌకర్యం కల్పించాలన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నిర్వహించిన సకల జనుల సమ్మెకు సకల కులాలు మద్దతునిచ్చాయని, ఆ విషయాన్ని గుర్తించి కుల వృత్తులను ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు నీలకంఠ చలమంద, చామకూరి నర్సయ్య , బత్తుల రమేశ్ , బుద్దా సత్యనారాయణ , వరికుప్పల వెంకన్న , ఎస్ కే నజీర్ , అన్నెపర్తి పద్మ , నిర్మల , సారగండ్ల వెంకటమ్మ , అనసూర్య , దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.