తెలంగాణ ఎంసెట్‌ -2 రద్దు

C

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం

– లీకేజీ కారకులపై కఠిన చర్యలు

హైదరాబాద్‌,జులై 29(జనంసాక్షి):వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్‌-2 పరీక్షను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరీక్షను రద్దు చేసి ఎంసెట్‌-3 నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీఐడీ అందించిన నివేదికపై కేసీఆర్‌ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సవిూక్ష నిర్వహించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, సీఐడీ డీజీ సత్యనారాయణ, పలువురు మంత్రులు, అధికారులతో చర్చించారు. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండాలంటే ఎంసెట్‌-2ను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. లీకేజీ కారకులను, దాని ద్వారా లబ్ధి పొందిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.ఎంసెట్‌-2 పరీక్ష లీకేజీ కేసు విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న సీఐడీ రోజుల వ్యవధిలోనే విలువైన సమాచారాన్ని సేకరించింది. ప్రశ్నాపత్రం లీకేజీ నిజమేనని.. దీనివల్ల సుమారు 100 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందినట్లు గుర్తించింది. రూ.15కోట్లు వరకు డీల్‌ కుదిరినట్లు నిర్ధారించింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న సీఐడీ.. వారిచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసు పురోగతికి సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రికి అందజేసింది. దీనిపై సవిూక్షించిన సీఎం.. పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించారు.కాగా ఎంసెట్‌-2 లీకేజి కేసులో అరెస్ట్‌ అయిన ఇద్దరు బ్రోకర్లు విష్ణు, తిరుమల్‌ను వైద్య పరీక్షల అనంతరం ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి గత రాత్రి విష్ణు, తిరుమల్‌ను సీఐడీ పోలీసుల అరెస్ట్‌ చేసి మెజిస్టేట్ర్‌ ముందు హాజరుపర్చారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజగోపాల్‌ను సీఐడీ విచారిస్తున్నారు.ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంలో అరెస్ట్‌ అయిన తిరుమల్‌ స్వస్థలం నల్గొండ జిల్లా చెరుకుపల్లి. నల్గొండలో తిరుమల్‌కు పలు వ్యాపారాలు ఉన్నాయి. కుమారుడు ఎంబీబీఎస్‌ చదువుతున్న సమయంలో ఎంసెట్‌ బోర్డులో పనిచేస్తున్న వారితో తిరుమల్‌కు పరిచయాలు ఏర్పడ్డాయి. ఇదే క్రమంలో తిరుమల్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు పాల్పడ్డాడు. ఎంసెట్‌ లీకేజీ వ్యవహారం నల్గొండ జిల్లా వ్యక్తి అరెస్ట్‌ అవడం జిల్లా వ్యాప్తంగా సంచలం రేకెత్తించింది. లీకేజీలో నల్గొండ జిల్లా వ్యక్తి ప్రధానంగా ఉండటంతో జిల్లా విద్యార్థులకు ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకులపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.