తెలంగాణ ఏర్పాటుకు ఆర్టీసీ కార్మికుల సంపూర్ణ మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 3 : తెలంగాణ కోసం ఆర్టీసి కార్మికులు పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని ఇందుకోసం కార్మికుల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసి తెలంగాణ స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌, ఎన్‌ఎంయు జోనల్‌ కార్యదర్శి లక్ష్మణ్‌ తెలిపారు. శనివారం నిజామాబాద్‌ డిపో 1,2 నుంచి బస్టాండ్‌ వరకు తెలంగాణ కోసం నిర్వహించిన చైతన్య యాత్రలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలోని ఆర్టీసి డిపోల్లోని కార్మికులందరు తెలంగాణ కోసం తమవంతు కృషి చేయాలని, కేంద్రం వెంటనే స్పందించి పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ జెఎసి ఇచ్చిన పిలుపును ఆర్టీసి కార్మికులు విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంటారని రాష్ట్ర కార్యదర్శులు బస్వంత్‌, జిజిరామ్‌, సిహెచ్‌ నర్సయ్యలు తెలిపారు. చైతన్య యాత్రలో భాగంగా కామారెడ్డి, బాన్సువాడ, బోధన్‌లలో పూర్తి చేసుకొని శనివారం నిజామాబాద్‌లో నిర్వహించామని, ఇక్కడి నుండి ఆర్మూర్‌లో పూర్తి చేసుకున్న తరువాత వరంగల్‌కు బయలుదేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వహీద్‌, కార్యదర్శి మురళిధర్‌, కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.