తెలంగాణ ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలను ఒప్పిస్తా
ఉద్యమకారులందరూ ఐక్యంగానే ఉన్నారు
కేంద్ర విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్
కేసీఆర్‌తో నాకు విభేదాలు లేవు : కోదండరాం
తెలంగాణ సాధనలో అందరితో పనిచేస్తాం : కేకే
లగడపాటి ఓ జోకర్ : పాల్వాయి
హైదరాబాద్, అక్టోబర్ 7 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పిస్తానని కేంద్ర విమానయాన శాఖా మంత్రి అజిత్ సింగ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు ఆయన హాజరయ్యారు. ఆర్‌ఎల్‌డీ తెలంగాణ శాఖను ప్రారంభింపజేసేందుకు అజిత్‌సింగ్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా అజిత్‌సింగ్‌ను టీ కాంగ్రెస్ ఎంపీలు, జేఏసీ నాయకులు ఉదయం భేటీ అయ్యారు. తెలంగాణకు మద్దతు ఇస్తున్న అజిత్‌సింగ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక భవిష్యత్తు కార్యాచరణపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా మధు యాష్కీ నివాసంలో జరిగిన అల్పాహార విందుకు ఎంపీలు మందా జగన్నాధం, గుత్తా సుకేందర్‌రెడ్డి, రాజయ్య, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు, ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్, ప్రజా కవి గద్దర్, తదితరులు హాజరయ్యారు. అల్పాహార విందు ముగిసిన అనంతరం వెలుపలకు వచ్చాక వారు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో తెలంగాణపై సానుకూల పవనాలు వీస్తున్నాయని అజిత్‌సింగ్ చెప్పారు. ఎంపీ మధుయాష్కీ నివాసంలో అల్పాహార విందు ముగిశాక ఆయన విలేకరులతో
మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే తప్పకుండా వస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణవాదులంతా ఏకతాటిపై ఉండడం హర్షదాయకమన్నారు. ఇదే ఐక్యతతో ఉద్యమాన్ని మరింత ముందుకు సాగించాలని నేతలకు పిలుపునిచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ మార్చ్‌పై ఢిల్లీలో చర్చ కొనసాగిందని తెలిపారు. తనకు కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపారు.
కేసీఆర్‌తో విభేదాల్లేవ్ : కోదండరామ్
టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుతో విభేదాలు లేవని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎవరో గిట్టని వాళ్లు లేనిపోని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఆరోపణలను తెలంగాణ ప్రజలు నమ్మబోరన్నారు. తనకు కూడా ఎవరితోను విభేదాలు లేవన్నారు. నిరంతరం చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఎవరి మార్గంలో వారు పయనిస్తూ, తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. అందర్నీ కలుపుకుని పోతున్నామన్నారు. శనివారం కూడా కేసీఆర్‌తో మాట్లాడానన్నారు. చిన్న చిన్న సమస్యలు సహజమని, వాటిని కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.
అందరినీ కలుపుకుని పోతాం : కెకె
తెలంగాణ సాధన కోసం కలిసొచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో ముందడుగు వేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. కేంద్ర మంత్రి, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్ సింగ్ తొలి నుంచి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారన్నారు. ఆదివారం ఆయన్ను మర్యాద పూర్వకంగానే కలిశామన్నారు. అయితే, ఆయన పెట్టుకునే తెలంగాణ రాష్ట్ర శాఖతో తమకు సంబంధం లేదన్నారు. అన్ని పార్టీల ఎంపీలతోను చర్చిస్తామన్నారు. తెలుగుదేశం ఎంపీలతో కూడా చర్చలు కొనసాగిస్తామని, కలిసి వచ్చే వారితో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు.
లగడపాటి ఓ జోకర్ : పాల్వాయి
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేస్తున్న వ్యాఖ్యలను నమ్మొద్దని, తెలంగాణ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. లగడపాటి ఓ జోకర్ అని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు వ్యాఖ్యానించడం తాను విన్నానని చెప్పారు. తెలంగాణపై టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావుతో కేంద్రం చర్చలు జరుపుతోందని చెప్పారు.