తెలంగాణ కోసం బతిమిలాడం పోరుబాటలో కలబడుడే..
2009 ప్రకటన చేసినపుడు తెల్వదా ?
ఏకాభిప్రాయం తెచ్చే బాధ్యత కాంగ్రెస్‌దే
ఆజాద్ వ్యాఖ్యలపై కోదండరాం ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 13 (జనంసాక్షి):
తెలంగాణపై కేంద్ర మంత్రి గులాంనబి ఆజాద్ చేసిన వ్యాఖ్యలను టిజెఎసి ఖండించింది. జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని అన్నారు. 2009, డిసెంబరు 9న తెలంగాణకు అనుకూలంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కష్టసాధ్యమని తెలియదా అని ప్రశ్నించారు. 2004, 2009 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని లబ్ధి పొందిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎవరి నుంచి ఆక్షేపణలు వస్తున్నాయో ఆజాద్ శ్వేతపత్రం విడుదల చేయాలని కోదండరామ్ డిమాండు చేశారు. ఆక్షేపణలకు పరిష్కార మార్గాలను తాము సూచిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సంప్రదింపులు అనవసరమని, నిర్ణయమే
మిగిలిందని అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం తేవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పైనే ఉందని అన్నారు. అందుకు తెలంగాణ మంత్రులు చొరవ చూపాలని డిమాండు చేశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మంట గలిపేవిధంగా ఆజాద్ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో తెలంగాణ ఇస్తే తెచ్చుకునే పరిస్థితులు పోయాయని, ఉద్యమాలతోనే తెలంగాణ తెచ్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ మార్చ్ కన్నా పెద్ద ఉద్యమం చేపట్టి తెలంగాణను సాధించుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణను ఎవరో ఇస్తారన్నది వట్టి మాటేనని అన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ నేతలందరూ సమైక్యమై ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.