తెలంగాణ కోసం సీపీఐ జంగు సైరన్
ఖమ్మం మెట్టులో పోరుయాత్ర ఆరంభం
సీపీఐతో కలిసి పనిచేసేందుకు జేఏసీ సై
సెప్టెంబర్ మార్చ్‌కు సీపీఐ జై
హైదరాబాద్ కవాతుతో ఢిల్లీ గుండెలదరాలి : కోదండరాం
తెలంగాణ కోసం ఒక్క మంత్రికూడా పనిచేస్తలేడు :నారాయణ
తెలంగాణ కోసం
కదిలిన ‘ఎర్ర’ దండు
ఖమ్మం మెట్టులో పోరుయాత్ర ఆరంభం
హైదరాబాద్, ఆగస్టు 25 (జనంసాక్షి) : తెలంగాణ కోసం సీపీఐ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఖమ్మం గడ్డ మీద ‘పోరుయాత్ర’ నిర్వహించి జంగు సైరన్ మోగించింది. ఈ సందర్భంగా జేఏసీతో కలిసి ఉద్యమించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. టీజేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు మద్దతిచ్చేందుకు ముందుకొచ్చింది. పోరు యాత్రలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కలిసి తెలంగాణ కోసం నినదించారు. హైదరాబాద్ కవాతుతో ఢిల్లీ గుండెలదరాలని కోదండరాం పిలుపునివ్వగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఒక్క మంత్రి కూడా పని చేస్తలేడని నారాయణ వాగ్బాణాలు సంధించారు.ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన అడ్డంకిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో తెలంగాణ కోసం పోరు యాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో కోదండరాం, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఊపిరిలూదిన పాల్వంచ పట్టణం నుంచే సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ పోరు యాత్ర ప్రారంభించడం విశేషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కేటీపీఎస్‌లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం చేయడంతో ఉద్యమం ఇక్కడి నుంచే మొదలైందన్నారు. తెలంగాణ పోరు యాత్రను పాల్వంచ నుంచే ప్రారంభించడం ఇదొక కారణంగా చెప్పవచ్చన్నారు. దీని ద్వారా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమైన తెలంగాణ పోరు యాత్ర నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో సెప్టెంబర్ మూడో తేదీ వరకు తెలంగాణ పోరుయాత్ర జరుగుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే ఆఖరి పోరాటమని, 1969కి ముందు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేశామన్నారు. మళ్లీ తెలంగాణ కోసం సీసీఐ ఉద్యమ బాట పట్టిందని నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే సీసీఐ తెలంగాణ ప్రజల మనోభవాలను గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ కోసం పోరుబాట చేపట్టాలని నిర్ణయానికి వచ్చిందన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి 5వేల కోట్ల రూపాయలను ప్రకటించాలని డిమాండ్ చేసినా, ఆ తరువాత ప్రజల అభిష్టం మేరకు వరంగల్‌లో జరిగిన సీపీఐ మహా సభలో, హైదరాబాద్‌లో జరిగిన జాతీయమహా సభలో ప్రత్యేక తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఖమ్మం జిల్లా ఉద్యమాల ఖిల్లా అని అన్నారు. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన ఖమ్మం జిల్లా నుంచే సీపీఐ తెలంగాణ పోరు యాత్రను ప్రారంభించడం రాష్ట్ర సాధనకు శుభసూచకమని నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ 2004 ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఇక్కడి ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేస్తూ ప్రత్యేక తెలంగాణ విషయంలో కాలయాపన చేస్తుందన్నారు. తెలంగాణ జిల్లాల్లోంచి తయారైన బొగ్గును ఆంధ్రా ప్రాంతానికి చెందిన థర్మల్ పవర్ స్టేషన్‌కు తరలించడం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించడమేనన్నారు. తెలంగాణలోని సహజ వనరులన్నింటినీ ఆంధ్రాకు తరలించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలుచేపట్టడం హేయమైన చర్య అని అన్నారు. ఇక్కడ తయారైన కరెంట్ ను కూడా ఆంధ్రాకు పంపి వారికి వెలుగునిచ్చి, ఇక్కడి ప్రజలను మాత్రం చీకట్లో ఉంచుతున్నారని ఆయన విమర్శించారు. వేలాది ఎకరాల వ్యవసాయ భూములను ముంచివేసే పోలవరం ప్రాజెక్టుకు, డిజైన్ మార్చాలని, మాకు అన్యాయం చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వినే స్థితిలో లేదన్నారు. గోదావరి నీటిని నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ద్వారా ఆంధ్రాకు తరలించడం తెలంగాణ నీటిని దోపిడీ చేయడమేనన్నారు. 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పాల్వంచనుంచే ప్రారంభమైందని, ఇప్పుడు కూడా మలిదశ ఉద్యమాన్ని పాల్వంచ నుంచే ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్క పౌరుడు ఉద్యమ బాట పట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ నాగేశ్వరరావు, పీవీ చౌదరి, హేమంతరావు, తదితరులు పాల్గొన్నారు.