తెలంగాణ కోసం.. సెల్‌టవర్ ఎక్కి పోచయ్య హల్‌చల్
నిజామాబాద్, నవంబర్ 9 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తో మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డుసభ్యుడు వీరమూర్తి పోచయ్య(50) శుక్రవారం సెల్ టవర్ ఎక్కి హల్ చల్ సృష్టించాడు. తెల్లవారుజామున మూడు గంటలకే ఆయన సెల్‌టవర్ ఎక్కి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలుమార్లు పెద్ద పెట్టున తెలంగాణ నినాదాలు చేశాడు. పోచయ్య సెల్‌టవర్ ఎక్కింది ఎవరూ గమనించలేదు. తెలంగాణ పాటలు పాడుతూ సెల్‌టవర్‌పై ఉన్న అతన్ని ఆ ప్రాంతంలోని పశువుల పాకలో నిద్రిస్తున్న ఇద్దరు యువకులు గమనించారు. ఈ సమాచారం పోలీసులకు చేరవేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్సై కృష్ణ అక్కడికి వచ్చి పోచయ్యను సముదాయించే ప్రయత్నం చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మంత్రి సుదర్శన్‌రెడ్డి, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ ఇక్కడికి వచ్చి తెలంగాణపై స్పష్టమైన హమీ ఇస్తే తప్ప సెల్‌టవర్ దిగేది లేదని పోచయ్య భీష్మించుకున్నాడు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లయ్యయాదవ్, జేఏసి కన్వీనర్ రాజలింగం, మాజీ ఎంపిటిసి ఆకుల శ్రీనివాస్ పోచయ్యను సెల్‌టవర్ దిగిరావాల్సిందిగా కోరారు. మంత్రి, గడుగు గంగాధర్, తాహెర్‌లతో మాట్లాడి తెలంగాణపై అనుకూలమైన నిర్ణయం తీసుకునేలా చూస్తామని వీరు నచ్చజెప్పడంతో పోచయ్య ఎట్టకేలకు సెల్‌టవర్ దిగాడు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. తెలంగాణ కావాలన్న ఆకాంక్షతోనే తాను సెల్‌టవర్ ఎక్కానని పోచయ్య స్పష్టం చేశాడు.