తెలంగాణ డేరా బాబా కేసీఆర్‌-రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఆగస్టు28 : సీఎం కేసీఆర్‌ పై టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావును తెలంగాణ డేరా బాబాగా ఆయన అభివర్ణించారు. సోమవారం కూకట్‌ పల్లిలో రేవంత్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కూకట్‌ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనుచరులు టీడీపీ దిమ్మెలు కూల్చడంపై రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ గల్లీల్లో రియల్‌ ఎస్టేట్‌ చేసుకునే కృష్ణారావును ఎమ్మెల్యేను చేస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు జెండా దిమ్మెలు కూలగొడతావా అని ప్రశ్నించారు. దేశంలో అరాచకవాది డేరా బాబా లాంటివాడు ఏపీలో జగన్‌ అయితే తెలంగాణలో కేసిఆరేనని తీవ్ర వ్యాఖ్యలుచేశారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజల కోసం పనిచేసినోడు కాదని అభిప్రాయపడ్డారు. సీఎం డేరా లేపాల్సి న అవసరం ఉందని తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత కేసీఆర్‌ కు కూడా డేరా బాబాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.