‘తెలంగాణ’ తేల్చితేనే అనిశ్చితికి తెర :రాఘవులు
హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగించాలంటే తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ సీపీఎం రాష్ట్ర కార్యకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడమా? లేదా సమైక్య రాష్ట్రంగానే కొనసాగించడమా? అనే విషయాన్ని తేల్చినప్పుడు రాజకీయ అనిశ్చితిని తొలగించవచ్చన్నారు. ఈ విషయంలో అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని రాఘవులు డిమాండ్ చేశారు. వైఖరిని ప్రకటించే విషయంలో ఇంక ఎంతమాత్రం జాప్యం తగదన్నారు. తెలంగాణలో ఓ మాట, ఆంధ్రలో ఓ మాట మాట్లాడుతూ ఈ మూడు పార్టీలు కాలం వెళ్లదీస్తున్నాయని రాఘవులు విమర్శించారు. ఉప ఎన్నికల్లో అవినీతిపైనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలోకి దిగినా ప్రజలు అంతగా స్పందించలేదన్నారు. అన్ని సమస్యల మాదిరిగానే అవినీతిని కూడా ప్రజలు ఓ సమస్యగానే చూశారే తప్ప దానిపై అంతగా ఆలోచించలేదని తేటతెల్లమైందని ఆయన పేర్కొన్నారు. అవినీతిపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, అవినీతి,అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం సాహసించడం లేదని, ఇందుకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్యలకు మిన్నకుండిన వైనమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను అరెస్టు చేయించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాఘవులు డిమాండ్ చేశారు.