తెలంగాణ పందెం కోళ్లకు ఆంధ్రాలో డిమాండ్‌

తెలంగాణలో పెంపకందార్లకు కాసుల పంట
హైదరాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): తెలంగాణలో పెంచుతున్న కోళ్లకు ఆంధ్రాలో డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది.  సంక్రాంతి సందర్భంగా పందెం కోళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. రానున్న సంక్రాంతిని పురస్కరించుకుని  ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడిపుంజుల వేడుకకు తెలంగాణ పుంజులు సై అంటున్నాయి.  పండుగ కోసం వివిధ జాతులకు చెందిన ఇక్కడి పుంజులకు గిరాకీ పెరిగింది. ఇక్కడ కొన్నేళ్లుగా పందెం కోళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి ఫాంహౌజుల్లో చాలామంది కోళ్లకు తర్ఫీదునిచ్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. కేవలం ఆంధ్రాకే పరిమితమైన కోడి పందాలు ఇప్పుడు హైదరాబాద్‌కు కూడా పాకాయి. ఆంధ్రాలో కోట్లు చేతులు మారే పందాల కోసం జూదర్లు వరంగల్‌ జిల్లాకు చెందిన పుంజులనూ భారీగా రంగంలోకి దించుతారనే సంగతి చాలామందికి తెలియదు.  ఆంధ్రా ప్రాంతం వారు స్థిర నివసాం ఏర్పాటుచేసుకున్న ప్రాంతాలో ఇవి జరుపుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌ జిల్లాలోని కాజీపేట, వరంగల్‌, హన్మకొండ, గ్రేటర్‌ గ్రామాలతోపాటు ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేసి పందెం కోళ్లను పెంచుతున్నారు. ఏటా ఒక్కో కేంద్రంలో 100 నుంచి 200 వరకు కోళ్లను పెంచి పందాలకు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో కోడిపుంజు  రూ.10వేల నుంచి రూ.లక్ష వరకూ అమ్ముడవుతుందని పెంపకందారులు చెబుతున్నారు. కాగా, హైదరాబాద్‌లో కోడిపందాల స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విూర్‌పేట, పహాడిషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఎల్బీనగర్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు పందెం కోళ్లపై దృష్టి సారించారు. దీనిని బట్టి తెలంగాణలో కూడా పందెం కోళ్లకు గిరాకీతో పాటు,పోటీలకు అవకాశాలు ఉన్నాయనితెలుస్తోంది.