”తెలంగాణ పటం”ను అధికారికంగా విడుదల చేసిన సర్వే ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ, జూన్ 5(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను సర్వే ఆఫ్ ఇండియా శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. సరిహద్దులను నిర్ధారిస్తూ… కాకతీయ కళాతోరణంతో మ్యాప్‌ను రూపొందించింది. హైదరాబాద్ నుంచి ఉన్న రైలు, రోడ్డు, విమాన మార్గాలను మ్యాప్‌లో సూచించింది. దేశంలోని 12వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణను సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. జిల్లాల వారిగా జనాభా వివరాలను పొందుపరిచింది.
తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక ఉన్నాయి. నదీ మార్గాలు, జిల్లా కేంద్రాలు, మ్యూజియంలు సహా పుణ్యక్షేత్రాలు, విశేషమైన ప్రదేశాల వివరాలను మ్యాప్‌లో స్పష్టంగా సర్వే ఆఫ్ ఇండియా సూచించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాకి మ్యాప్‌ను విడుదల చేసింది. అయితే తెలంగాణ రాజముద్రలో ఉన్నటువంటి చార్మినార్‌ను చూపించకపోవడంతో వివాదంగా మారింది. తెలంగాణకు సంబంధించిన వనరులు, వారసత్వ సంపద గురించి మ్యాప్‌లో వివరంచారు.
భారత దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ప్రధాన భాషగా తెలుగు, ఉర్దు ద్వితీయ భాషగా ఉందని వివరించింది. మొత్తం 10 భాషలతో కూడిన మ్యాప్‌ను సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జిల్లా హెడ్ క్వార్టర్స్, మెట్రో వివరాలను కూడా మ్యాప్‌లో పొందుపరిచింది. 2011 లెక్కల ఆధారంగా జనాభాను లెక్కిస్తూ మ్యాప్‌ను రూపొందించింది. సికింద్రాబాద్, హైదరాబాద్‌లకు ప్రత్యేక స్థానం కల్పించింది. పోలవరం ముంపు ప్రాంతాల నుంచి ఏడు మండలాలను ఆంధ్రాకు కలుపుతూ మ్యాప్‌లో సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.