తెలంగాణ ప్రయోజనాలకోసమే మహాఒప్పందం

C

– మంత్రి హరీష్‌ రావు పవర్‌పాయింట్‌ ప్రజేంటేషన్‌

హైదరాబాద్‌,ఆగస్టు 27(జనంసాక్షి):మంత్రి హరీష్‌ రావు మరో సరికొత్త ప్రయోగాన్ని అమలు చేశారు. మంత్రులు విలేకరుల సమావేశాలు పెట్టడం సాధారణమే. విలేకరుల సందేహాలు తీర్చడం మామూలే. అదీకాకుంటే విలేకరులే కొన్ని ప్రత్యేక సందర్భాలలో విూట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేసి మంత్రిని పిలిచి ముఖాముఖి సమావేశాలు నిర్వహించడం కూడా పరిపాటే. కానీ, వీటినికి భిన్నంగా, సరికొత్తగా ఓ కార్యక్రమం నిర్వహించారు మంత్రి హరీష్‌ రావు. వంద మందికి పైగా వివిధ పత్రికలు, టివి చానళ్లకు చెందిన ఎడిటర్లు, సి.ఇ.ఓలు, బ్యూరో చీఫ్‌ లు, సీనియర్‌ రిపోర్టర్లతో ఒక ప్రత్యేక సమావేశం పెట్టి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల గురించి పూసగుచ్చి నట్టు వివరించారు. గత ప్రాణహిత చేవెళ్ళ పథకాన్ని సీఎం కేసీఆర్‌ రీ డిజైన్‌ ఎందుకు చేశారో విడమర్చి చెప్పారు. థియరీతో పాటు టెక్నికల్‌ అంశాలను, నీటి లభ్యత, రీ డిజైన్‌ ఆవశ్యకత తదితర అంశాలను జర్నలిస్టులతో పంచుకున్నారు.

రెండేళ్ళలో 12 సమావేశాలు :

మహారాష్ట్రతో ఒప్పందం వెనుక తాము పడిన కష్టాన్ని మంత్రి హరీష్‌ రావు విలేకరులతో పంచుకున్నారు. సమైక్య పాలనలో 8 ఏళ్లలో పాలకులు మూడు సమావేశాలు జరిపితే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండేళ్లలో 12 సమావేశాలు నిర్వహించిందన్నారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులకు జరిగిన ఒప్పందం ఆషామాషీగా జరిగింది కాదని, దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వ కృషి ఎంతగానో ఉందని అన్నారు. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీలపై విపక్షాలు, కొన్ని సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, హైదరాబాద్‌ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు మంత్రి. అపోహలు తొలగించేందుకు, ఒప్పందం ముందూ.. వెనకా జరిగిన ప్రయత్నాలను, వాస్తవాలను ఆయన ప్రజెంటేషన్‌ ద్వారా సోదాహరణంగా వివరించారు.తుమ్మిడిహట్టి ఎత్తు నిర్ధారణ గతంలో ఎన్నడూ జరగలేదని, 152 విూటర్ల ఎత్తుపై ఏ ఒప్పందాలు జరగలేదని మంత్రి హరీష్‌ రావు వివరించారు. తుమ్మిడిహట్టి ఒప్పందంలో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయన్నారు. 152 విూటర్ల ఎత్తుతో నిర్మిస్తే తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీరు అందించవచ్చన్న ప్రచారం ఉత్తిదేనని, ఇది ఆచరణ సాధ్యం కాదని మంత్రి తేల్చిచెప్పారు. ఎత్తు 152 విూటర్లు అయినా, 148 విూటర్లయినా.. తుమ్మిడిహట్టి నుండి మల్లారం వరకు కేవలం 20వేల ఎకరాలకు మాత్రమే గ్రావిటీ ద్వారా నీరు అందించవచ్చన్నారు. అక్కడి నుండి ఎల్లంపల్లికి లిఫ్ట్‌ ద్వారా నీరు అందించాల్సిందేనన్నారు.తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పరిధిని తగ్గించడం వెనుక సిడబ్ల్యుసి లేఖ కూడా కారణమని మంత్రి హరీష్‌ రావు వివరించారు. ప్రాణహితపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి డిపిఆర్‌ పంపగా, 04.03.2015న స్పందించిన సీడబ్ల్యూసీ, నాటి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతంలో అనుకున్నంత నీటి లభ్యత లేదని అప్పటి సర్కారుకు లేఖ పంపిందని మంత్రి గుర్తుచేశారు. మొదట తుమ్మిడిహట్టి వద్ద 160 టిఎంసిల నీటి లభ్యత ఉందని గత ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. సిడబ్ల్యుసి అక్కడ 102టిఎంసిల నీటి లభ్యతే ఉందని.. 46 టిఎంసిలు మాత్రమే మళ్ళింపుకు అనువుగా ఉన్నాయని పేర్కొందని హరీష్‌ రావు వివరించారు. 46 టిఎంసిలతో 16.40లక్షల లక్షల ఎకరాలకు నీరివ్వడం అసాధ్యం కాబట్టే.. ప్రత్యామ్నాయం కోసం జరిపిన ప్రయత్నంలో 275 టిఎంసిల నీటి లభ్యత ఉన్న మేడిగడ్డను గుర్తించామని మంత్రి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద లభించే 46 టిఎంసిల నీటిని ఆదిలాబాద్‌ అవసరాలకే వినియోగించేలా డిజైన్‌ చేశామన్నారు.

వ్యయం పెరుగుదలపై?

అంచనా వ్యయం నిబంధనల ప్రకారం పెరిగిందే తప్ప ఎక్కడా అనవసర వ్యయం జతకాలేదని మంత్రి హరీష్‌ రావు వివరించారు. 2007లో రూ.17,500కోట్ల అంచనాతో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు జీవో జారీ చేశారని, 2008లో దానిని అనూహ్యంగా రూ.38,500 కోట్లకు పెంచారని, 2009 ఎన్నికలకు ముందు నాలుగు జిల్లాల్లో శంకుస్థాపనలు చేశారన్నారు. అయితే, 2008 లోనే ప్రిలిమినరీ అంచనా రూ.42,300 కోట్లుగా పేర్కొన్నారని గుర్తుచేశారు. సిమెంట్‌, స్టీలు ధరలు ఎప్పటికపుడు మారుతూనే ఉంటాయని, ఇక భూసేకరణ వ్యయం, ప్రాజెక్ట్‌ పని పరిధి అన్నీ పెరిగినందున సహజంగా అంచనాల పెరుగుదల నమోదైందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎక్కడా అంచనాలు పెంచే దుర్మార్గపు ఆలోచనలు చెయ్యలేదన్నారు మంత్రి హరీష్‌ రావు.గోదావరిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో 2008 నుండి 2014 దాకా మొత్తం మూడు సమావేశాలు జరిగితే, 2014 నుండి 2016 వరకు తాము 12 సమావేశాలు జరిపి.. మొత్తం అంశాన్ని కొలిక్కి తెచ్చామని మంత్రి హరీష్‌ రావు వివరించారు. మహారాష్ట్ర అనుమానాలను నివృత్తి చేయడంలో అధికారులు, ఇంజనీర్లు పడిన శ్రమను ఆయన విూడియా దృష్టికి తీసుకొచ్చారు.మేడిగడ్డ బ్యారేజీని బహుముఖంగా రూపుదిద్దామని.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వరుస బ్యారేజీల వల్ల ఎప్పుడూ 60 కిలోవిూటర్ల దూరం 32 టిఎంసిల నీరు నిల్వ ఉంటుందన్నారు మంత్రి హరీష్‌ రావు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు తొలిదశ ద్వారా సాగునీరు అందించాలని నిర్ణయించామని ప్రకటించారు. ప్రాజెక్టు తొలి లబ్దిదారుగా వరంగల్‌ జిల్లా నిలువనుందని చెప్పారు.