తెలంగాణ భగభగ

5

నిజామాబాద్‌లో నిప్పులు అదిలాబాద్‌లో అగ్గి

పిట్టల్లా రాలిపోతున్న జనాలు

హైదరాబాద్‌,మే20(జనంసాక్షి): తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. భానుడి భగభగలతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. రోహిణికి ముందే ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో కూడా ఇటీవలికాలంలో పలువురు వడ దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.  హైదరాబాద్‌ లో నలభై రెండు డిగ్రీలపైగా వేడి నమోదు కాగా, నిజామాబాద్‌ లో కూడా అదే మాదిర తీవ్రమైన ఎండలు ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నాయి.  ఆదిలాబాద్‌ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే వడదెబ్బకు  నలుగురు మృతిచెందారు. ఖానాపూర్‌ మండలం పాతఎల్లాపూర్‌కు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యురాలు కరిపె విజయలక్ష్మి వడదెబ్బతో మంగళవారం మృతిచెందింది. చెన్నూరులోని జెండా వీధికి చెందిన మానికవ్నతు శంకరి (52) అనే వృద్ధుడు కూడా వడదెబ్బతో మృతిచెందాడు. సిర్పూరు(టి): మండల కేంద్రంలోని గోవింద్‌పూర్‌ కాలనీకి చెందిన దన్‌పెల్లి భరత్‌ (38) వ్యవసాయ పనులకు వెళ్లగా  వడదెబ్బకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నేరడిగొండ మండలం  తేజాపూర్‌ గ్రామానికి చెందిన మారిపెల్లి లస్మన్న(55) మంగళవారం వడదెబ్బతో మృతి చెందాడు. నిజామాబాద్‌  నిప్పుల కొలిమిలా మారింది.. భానుడి భగభగకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు..రాష్ట్రంలోనే జిల్లా 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతకు చేరువలో ఉంది. ఇది దేశంలోనే రెండో గరిష్ఠ ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ప్రతి వేసవి సీజన్‌లో భానుడి ప్రభావం జిల్లాపై ఉంటుంది. అయితే గత వేసవిలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అంతకు ముందు సీజన్‌లోనూ ఉష్ణోగ్రత ఈ స్థాయిలో కనిపించలేదు. కానీ.. ఈ సీజన్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒకదాని తర్వాత మరొకటి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం గరిష్ఠంగా 46.1 డిగ్రీలకు చేరుకుంది. వేడిమితో కూడిన గాలులు వీయటంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదు. భానుడి దెబ్బకు వరంగల్‌ విలవిల్లాడుతోంది. దాదాపు 44.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమికితోడు వడగాడ్పులు వీచడంతో జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బ సోకి నలుగురు మృతిచెందారు. హన్మకొండలో వీధుల్లోకి రావాలంటేనే జంకుతున్నారు.

భానుడి ప్రతాపంతో తెలంగాణలో ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్‌లో అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై వరుససగా రెండోరోజు కూడా నిజామాబాద్‌ నిప్పులకొలిమిలా మారింది. దీంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ కారణంగా రోడ్లపై కర్ఫ్యూ వాతావరణం కన్పిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రత కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా పెరిగింది. వరంగల్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య, మధ్యభారతం నుంచి పొడి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే వరకు వాతావరణ చల్లబడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.వాయువ్య దిశగా వీస్తున్న ఉష్ణగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని.. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడడంతో  రోడ్లన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. బయటకు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 గంటల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాయువ్య దిశగా వీస్తున్న ఉష్ణగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు 25 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి.ఇదిలావుంటే ఎండ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో పలుచోట్ల మంగళవారం సాయంత్రానికి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు వీచాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని, తెలంగాణ, కోస్తాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ విభాగం అధికారి ఒకరు తెలిపారు.