తెలంగాణ మార్చ్ మహాసంగ్రామమైతది !
– పాలకులకు అందిన సంకేతాలు
– రిపోర్టు అందించిన ఇంటెలిజెన్స్
– టీ మంత్రులతో సీఎం చర్చకు కారణమిదే !
– వాయిదా వేసకోవాలని కిరణ్ వేడుకోలు
– కవాతుకు వెనక్కు తగ్గమంటున్న తెలంగాణవాదులు
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (జనంసాక్షి) :
ఇప్పుడు మొదలైంది అలజడి. తెలంగాణ మార్చ్ జరుగక ముందే పాలకులకు, ఆ సమర సన్నాహాలు ముచ్చెమటలు వస్తున్నాయి. ఉద్యమకారుల కవాతు ఎలా ఉండనుందో కలలోకి వచ్చి గద్దెలు, మిద్దెలు కూలుతాయేమోనన్న భయం ఇక వెంటాడడం మొదలైంది. ఇప్పటి దాకా వాళ్లతో, వీళ్లతో తెలంగాణ వాదులను బుజ్జగించేందుకు పాలక పెద్దలు చేసిన ప్రయత్నాలు, ఇప్పుడు ఏకంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డినే రంగంలోకి దింపాయి. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని తెలంగాణవాదులను వేడుకునేలా చేశాయి. ఎప్పటి నుంచో తెలంగాణ మార్చ్ నిర్వహించడం తథ్యమని, ఈ కవాతుతో ఢిల్లీ పీఠాలు దద్దరిల్లేలా చేస్తామని టీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణవాదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా మిన్నకుండిపోయిన పాలకుల్లో ఇప్పుడు చలనం రావడానికి కారణమేంది ? ఉంది. తెలంగాణ మార్చ్ ఎలా ఉండబోతుందో, దాని రూపురేఖలను వివరిస్తూ కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలకు ఘాటైన నివేదిక అందించింది. అందుకే, ఇప్పుడు పాలకుల్లో చలనం వచ్చింది. తెలంగాణ మార్చ్ దెబ్బకు తమ భవిష్యత్తు ఆగమ్యగోచరం కానుందేమోనన్న భయం పట్టుకుంది. దీంతో గురువారం హడావిడిగా ఏకంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ మార్చ్‌ను నిలువరించేందుకు రంగంలోకి దిగారు. తెలంగాణ మంత్రులతో చర్చలు జరిపారు. తెలంగాణ మార్చ్ నిర్వహించవద్దని తాను అనడం లేదని, నిమజ్జనం, జీవవైవిధ్య సదస్సు ఉన్నందున వాయిదా వేసుకోవాలని మాత్రమే చెబుతున్నానని, టీ మంత్రులు తెలంగాణవాదులకు ఇదే విషయాన్ని వివరించి వాయిదా వేసుకోవాలని చెప్పాలని బుజ్జగింపులకు దిగారు. ఎప్పటిలాగే మన తెలంగాణ మంత్రులు తలూపి చెప్పి చూస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. తెలంగాణవాదులు మాత్రం సీఎం బుజ్జగింపులను లెక్క చేయమంటున్నారు. ఎవరు చెప్పిన వినేది లేదని, పండుగలనూ పబ్బాలను ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏనాడో త్యాగం చేశామని పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఉఠంకిస్తూ సకల జనుల సమ్మె కోసం పోయినేడాది దసరా పండుగను కూడా జరుపుకోలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈసారి వినాయక నిమజ్జనం ఉన్నా తెలంగాణ మార్చ్‌ను జరిపి తీరుతామని, అది కూడా ట్యాంక్‌బండ్ పైనే నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇక్కడ గతాన్ని కూడా ఓసారి నెమరు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నాడు 2009లో కూడా డిసెంబర్ 10న అసెంబ్లీని ముట్టడి కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహిస్తామని స్టూడెంట్ జేఏసీ ప్రభుత్వాలకు ఆల్టిమేటం ఇచ్చింది. అప్పుడు కూడా ఆ ఉద్యమభాగం తీరు కూడా ఉధృతంగా జరుగుతుందని, అదేగానీ జరిగితే ప్రభుత్వాల మనుగడ కష్టమని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రిపోర్టు ఇచ్చాయి. దీంతో అప్పుడు దిగి వచ్చిన కేంద్రం ఆ చారిత్రక ఉద్యమ ఘట్టం ఆవిష్కృతం కాక మునుపే, అంటే, డిసెంబర్ 10కి ఒక్కరోజు 9వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రాత్రికి రాత్రి అప్పటి హోం మంత్రి చిదంబరంతో ప్రకటన చేయించింది. ప్రకటించిన తెల్లారే ప్రకటనను వెనక్కి తీసుకుని మోసం చేసిందన్నది వేరే విషయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ మార్చ్ విశ్వరూపాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక రూపంలో ముందే చూపించాయి. దీంతో ఇక ముందు కేంద్ర, రాష్ట్ర పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఇటు ప్రజల్లో, అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.