తెలంగాణ వాడినైనందుకే.. నాకు అన్యాయం జరిగింది
పదవీవిరమణ సభలో ఓ జడ్జి ఆవేదన
ప్రత్యేక రాష్ట్ర సాధన మన జన్మ హక్కు
మన బిడ్డల బలిదానాలు వృథా కావని వెల్లడి
ఏళ్లపాటు వేలాది మంది ప్రజలకు న్యాయం చేసిన న్యాయమూర్తి ఆయన, కానీ, ఆయనకే న్యాయం జరుగలేదు. కారణం ఆయన తెలంగాణవాడు కావటమే. ఈ విషయాన్ని ఇంతకాలంగా మదిలోనే ఉంచుకుని, తన విధి నిర్వహణలో సొంత ఆవేదనను వెల్లడించుకునే అధికారం ఆయనకు లేకపోవడంతో, చివరికి తన బాధను చెప్పుకోవడానికి ఆ తెలంగాణ న్యాయమూర్తి తన పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభనే వేదికగా చేసుకున్నారు. తాను అనుభవించిన వివక్షను సంక్షిప్తంగా వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ లీగల్, అక్టోబర్ 4 (జనంసాక్షి) :గత నెల 30న జడ్జి ఎం.ఏ.షరీఫ్ పదవి విరమణ పొందారు. ఆయనకు శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ తెలంగాణ వాడినైనందునే తనపై కక్ష గట్టి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పదవి విరమణ ఓ బలిదానం లాంటిదేనని అభివర్ణించారు. తెలంగాణ యువకుల ఆత్మబలిదానాలు వృథా కావని, తప్పకుండా తెలంగాణ వచ్చి తీరుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు ఎనలేనివని కొనియాడారు. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని సీమాంధ్రులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. తమ సహనాన్ని చేతకానితనంగా భావిస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. ప్రతి పౌరుడు తెలంగాణ కోసం జీవకణంగా మారుతున్నాడన్నారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా ప్రభుత్వంపై దాడి చేసి, తెలంగాణ సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్, కార్యదర్శి రఘునందన్‌రావు, ఉపాధ్యక్షుడు ఒంటెల రత్నాకర్, న్యాయవాదులు బాస సత్యనారాయణ, రవీందర్‌సింగ్, రబ్బాని, అంజయ్య, తనుకు శ్రీరాములు, కనుకుల సంజీవరెడ్డి, నాగరాజు తదితరులు జడ్జి షరీఫ్‌ను ఘనంగా సన్మానించారు. ఎప్పుడూ శాంతంగా ఉండే జడ్జి ఇలా తెలంగాణ గురించి ఓ ఉద్యమకారుడిలా మాట్లాడారంటే, ఆయన ఎదుర్కొన్న వివక్ష ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.