తెలంగాణ సంక్షేమమే లక్ష్యం: ఎంపి
ఆదిలాబాద్,సెప్టెంబర్4(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో కొనసాగుతోందని ఎంపీ గొడం నగేష్ అన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులతో పాటు అదనంగానూ రాబడుతామని చెప్పారు. రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యంపై తెరాస ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. తన పార్లమెంటు నిధులతో నియోజకవర్గానికో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. రైల్వే లైను నిర్మాణానికి నిధుల మంజూరును ప్రత్యేకంగా ప్రస్తావించి జిల్లాకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రగతి నివేదన సభకు ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు కూడా ఉత్సాహంగా ప్రజలు సభలకు తరలివచ్చేందుకు పేర్లు నమోదు చేసుకోలేదని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత భారీ సదస్సును ఎప్పుడు చూడలేదని చెప్పారు. ఇంతటి భారీ సదస్సును చూసే అదృష్టం కూడా రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో చేపట్టిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ నోట వినేందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా ప్రజలు తరలి వచ్చారన్నారు. గత ప్రభుత్వాల 70 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెరాస పార్టీని ఆదరిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.