తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత

41472028453_625x300

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావుపై ఉద్యోగులు చేయిచేసుకున్నారు. అతడిని సీట్లో నుంచి బయటకు లాక్కొచ్చి ఆందోళన చేశారు. అవినీతికి పాల్పడటమే కాకుండా తమను వేధిస్తున్నాడని, అటెండర్ నుంచి పై స్థాయి ఉద్యోగులపైనా అతడి వేధింపులు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

సర్వీసులు, సెలవులకు సంబంధించి కూడా ఆయన వేధిస్తున్నాడని చెప్పారు. గత కొద్ది రోజులుగా పద్దతి మార్చుకోవాలని చెబుతున్నా అతడు తీరు మార్చుకోకపోవడంతో తాము నేడు చేయిచేసుకున్నామని వారు అంటున్నారు. అయితే, ఉద్యోగుల విభజన అంశమే వివాదానికి దారి తీసిందని సచివాలయ వర్గాలు అంటున్నాయి. శ్రీనివాసరావుది ఆంధ్రప్రదేశ్ స్థానికత అని చెప్తున్నారు.