తెలంగాణ సాగునీటి రంగంలో మరోఅద్భుతఘట్టం ఆవిష్కృతం

` పాలమూరు డ్రైరన్‌ సక్సెస్‌..
` తొమ్మిది మోటార్‌లలో మొదటి మోటార్‌ను విజయవంతంగా నడిపించిన ఇంజనీర్లు
` సంబురాలు చేసుకున్న అధికారులు..హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
` త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా వెట్‌రన్‌కు సిద్ధం చేస్తున్న యంత్రాంగం
మహబూబ్‌నగర్‌(జనంసాక్షి): తెలంగాణ సాగునీటి రంగంలో మరోఘట్టం ఆవిష్కృతమైంది. పాలమూరు` రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్‌ పంప్‌ హౌస్‌ వద్ద చేపట్టిన మొదటి పంపు డ్రైరన్‌ విజయవంతమైంది. తొమ్మిది మోటర్లలో మొదటి మోటర్‌ డ్రైరన్‌ను ఇంజినీర్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇరిగేషన్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ రావు దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, త్వరలోనే వెట్‌రన్‌ చేసేందుకు యంత్రాంగా సిద్ధమవుతున్నది. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల విూదుగా నీటిని విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సలహాదారు పెంటారెడ్డి, సీఈ హవిూద్‌ ఖాన్‌, మేఘా కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.పీఆర్‌ఎల్‌ఐసీ పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి మొత్తంగా ఆరు దశల్లో నీటిని ఎత్తి పోయాల్సి ఉంది. అందుకు సంబంధించి ప్రభుత్వం పనులను మొత్తంగా 21 ప్యాకేజీలు గా విభజించగా.. అందులో నార్లాపూర్‌ నుంచి ఉద్దండాపూర్‌ వరకు 18 ప్యాకేజీల పనులను చేపట్టింది. అందులో 4 పంప్‌హౌజ్‌లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే నార్లాపూర్‌, ఏదుల, వట్టెంల పంప్‌హౌజ్‌లు తుదిదశకు చేరుకొన్నాయి. ఉద్దండాపూర్‌ పంప్‌హౌజ్‌ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నార్లాపూర్‌ పంప్‌హౌజ్‌లో 145 మెగావాట్ల సామర్థ్యమున్న 9 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉంది.ఏదుల, వట్టెంల పంప్‌హౌజ్‌లలో 9G1 చొప్పున పంపులను, ఉద్దండాపూర్‌లో 4G1 పంపులను అమర్చాల్సి ఉంది. ఇప్పటికే నార్లాపూర్‌ పంప్‌హౌజ్‌లో 2, ఏదులలో 3, వట్టెంలో 3 పంపుల అమరిక పూర్తిగా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో నార్లాపుర్‌ పంప్‌హౌజ్‌లో అమర్చిన మొదటి పంప్‌ డ్రైరన్‌ను నేడు నిర్వహించారు. పాలమూరు ప్రాజెక్టు మొదటి పంప్‌ డ్రైరన్‌కు సక్సెస్‌ కావడంతో ఇక్కడి రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. త్వరలోనే తమ బీడు భూముల్లో కృష్ణమ్మ పరుగులు తీస్తుందని, ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ఆనందపడుతున్నారు.