తెలనున్న బీహర్ భవితవ్యం
పాట్నా,నవంబరు 9(జనంసాక్షి):బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బిహార్ ఫలితాలపై చాలా ఉత్కంఠ నెలకొంది. బీహార్ అసెంబ్లీలో 243 సీట్లకు మొత్తం మూడు దశల్లో ఎన్నికల్లో జరిగాయి. అక్కడ ఓవైపు ఎన్డీయే కూటమి(బీజేపీ,జేడీయూ), మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్‌లు మహాకూటమిగా బరిలో నిలిచాయి. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చూస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆర్జేడీ యువనాయకుడు తేజస్వీ గట్టిగానే ప్రయత్నించారు.బిహార్‌లో పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. ఫలితాలపై మరింత ఆసక్తిని పెంచాయి. బీజేపీ – జేడీయూ కూటమికి, ఇటు ఆర్జేడీ – కాంగ్రెస్ మహాకూటమికి కూడా పోటాపోటీగా సీట్లు వస్తాయని పలు సర్వేలు చెప్పాయి. అయితే మహాకూటమికి కొద్దిపాటి అడ్వాంటేజ్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ గణంకాలు చెబతున్నాయి. అయితే రిపబ్లిక్ జన్ కీ బాత్ సర్వే మాత్రం ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే బిహార్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారా? లేక హంగ్ ఏర్పడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.మరోవైపు తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై చాలా ఉత్కంఠ నెలకొంది.ఇక్కడ 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ప్రధానంగా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు. ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు.. ఫలితాలపై మరింత ఉత్కంఠను పెంచాయి.ఇక, అటు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇటు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మినిట్ టూ మినిట్ అప్‌డేట్‌ను విూకు అందించేందుకు న్యూస్18 తెలుగు సిద్ధంగా ఉంది.
బీహార్‌లో ఓట్ల లెక్కింపునకు అదనపు కౌంటింగ్ సెంటర్లు..
కరోనా నేపథ్యంలో బీహార్‌లో ఓట్ల లెక్కింపునకు అదనపు కౌంటింగ్ సెంటర్లు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ హెచ్‌ఆర్ శ్రీనివాస తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో కౌంటింగ్‌లో భౌతికదూరం నిబంధన పాటించాల్సిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు 38 కౌంటింగ్ సెంటర్లను వినియోగించామని, ప్రస్తుతం ఆ సంఖ్యను 55కు పెంచామని వెల్లడించారు. పట్నాలో 14 నియోజకవర్గాల ఓట్లను కేవలం ఒకే కౌంటింగ్ కేంద్రంలో (ఏఎన్ కళాశాల) లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు.ఇందుకోసం కౌంటింగ్ కేంద్రంలో 30 కౌంటింగ్ హాళ్లను ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ సెంటర్ల లోపల సీసీకెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం వెలుపల కుర్చొని ఎప్పటికప్పుడు ఫలితాలు తెలుసుకునేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రానికి ఎవరూ వచ్చినా వారి వివరాలను లాగ్ బుక్‌లో నమోదు చేస్తామని తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ (సీఆర్‌పీసీ) అమలు చేస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 59 కంపెనీలకు చెందిన పారామిలటరీ భద్రతా దళాలను రంగంలోకి దించారు.