తెలుగు రాష్ట్రాలకు కేబినేట్‌లో చోటు లేనట్లే
ఎంపిలున్నా పట్టించుకోని ప్రధాని
హైదరాబాద్,అక్టోబర్23(జనంసాక్షి): కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ప్రానిధ్యం లేకుండానే మరోమారు ఎన్నికలకు బిజెపి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. గడిచిన ఏడాది ఉన్న ఒకరిని కూడా తొలగించి విస్తరణలో తెలంగాణకు స్థానం లేకుండా చేయడంతో ఇప్పుడు పార్టీ పరంగా ముందుకు వెళుతున్నారు. కేంద్ర సర్కార్‌లో తెలుగు వాళ్ల వాయిస్ లేకుండా పోయిందన్న భావన పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఇంతకాలం తెలుగువాడిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడంతో కొంత వెలితి ఏర్పడింది. తరవాత ఇప్పుడు దత్తాత్రేయను కూడా తప్పించారు. ఎపిలో ఇద్దరు ముగ్గురు ఎంపిలు ఉన్నా ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ దిశగా మోడీ ఆలోచన కూడా చేయడం లేదు. ఎన్నికలు రానున్న వేళ, విభజన సమస్యలు వెన్నాడుతున్న తరుణంలో ప్రానిధ్యం లేకుండా పోయిందని ఉభయ తెలుగురాష్ట్రాల బీజేపీ నేతలు కనీసంగా కూడా ఆందోళన చెందడం లేదు. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయను పక్కకు పెట్టారు. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి చేశారు. దీంతో ఇక తెలుగు రాష్ట్రాలకు ఏడాది కాలంగా పెద్దదిక్కు అన్నది లేకుండ ఆపోయింది. కేంద్ర మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని కొంతకాలంగా ఎదురుచూసిన బీజేపీ నేతలకు ఇక ఎన్నికలకు వెళ్లడం మినహా మరో గత్యంతరం లేదు. దత్తాత్రేయకు గవర్నర్‌గిరిపై ఆశలు పెట్టినా అలాంటి అవకాశం కూడా రాలేదు. అయితే ఆ గవర్నర్‌గిరి కూడా వస్తుందా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది. వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో చక్రం తిప్పుతామని బీరాలు పలుకుతున్న బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఓ రకంగా అవమానకరంగానే ఉంది. కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించే నేతలు కరువయ్యారు. కేంద్ర మంత్రి పదవిని ఆశించిన ఎందరో నేతలు మోడీ ఎత్తులతో భంగపడ్డారు. భవిష్యత్‌లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందో.. లేదో చెప్పలేం. తెలుగు రాష్ట్రాల్లో అంతంతమాత్రంగా ఉన్న బిజెపి ఇప్పుడు అధికారం తమదే అంటూ దూకుడు ప్రదర్శిస్తోంది. తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో దాని సత్తా ఏంటన్నది తెలియనుంది.