తెల్లారక ముందే తెల్లారిన బతుకులు
పత్తి ఏరుకునే కూలీలను మింగిన పాలలారీ
విషాదంలో చామనపల్లి గ్రామం
ఆరుగురు మృతి సుమారు పదిమంది గాయాలు
కరీంనగర్,నవంబర్17(జనంసాక్షి): పొట్ట తిప్పలకోసం నితెల్లవారకముందే కూలీ పనికోసం ఉన్న ఊరును వదిలేసి వేరే గ్రామానికి వెల్లే వారి జీవితాలు తెల్లారాయి. లారీ రూపంలో ముంచుకువచ్చిన మృత్యువు ఆరుగురి ప్రాణాలు బలితీసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లికి చెందిన సుమారు 15 మంది కూలీలు నిత్యం పత్తిని ఏరేందుకు గాను ఇల్లంతకుంట మండలంకు వెల్తుంటారు. అదే క్రమంలో శుక్రవారం ఉదయం తెల్లవారు జామున బయల్దేరి కోత్తపల్లి మండలం మల్కాపూర్ బైపాస్‌కు చేరుకోగానే ఎల్లమ్మకుంట వద్ద ఎదురుగా వచ్చిన పాలలారీ వేగంగా డీకొట్టింది. దీంతో ఆటో మొత్తం ఎగిరి పడింది. ఆటోకిందనే నలుగురు నలిగిపోగా, మరోఆరుగురు ఎగిరిపడడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. సంఘటనను చూసిన స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీస్‌లు 108 వాహనంలో క్షతగాత్రులను తరలించారు. స్పాట్‌లో నే ముగ్గురు చనిపోగా మరో ముగ్గురు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. లారీ రూపంలో ప్రమాదం దూసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్‌రోడ్‌లో మొత్తం పిచ్చిచెట్లు మొలిసి ఏపుగా పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. బైపాస్ రోడ్డు ఏర్పాటయ్యాక వాహనాల రద్దీ పెరిగిపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నా కూడా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్‌అండ్‌బి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. సంఘటనా స్థలాన్ని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రమేశ్ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు రెండుగంటలకుపై గా సహాయక చర్యలు చేపట్టడానికి సమయం తీసుకుంది. వార్త దావానంలా వ్యాప్తి చెందడంతో ఇరుగు పొరుగు గ్రామాలప్రజలు తరలివచ్చి సంఘటనను చూసి చలించిపోయారు. ప్రమాదాల నివారణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనేది వాస్తవం. రోడ్ల విస్తరణపై చూపిస్తున్న శ్రద్ద ప్రమాదాల నివారణపై చూపించకపోవడంతో ప్రాణాలు గాలిలోహరీమంటున్నాయి.
మృతుల గుర్తింపు -ఆసుపత్రికి వీఐపీల తాకిడి
ఆరుగురిని బలి తీసుకున్న సంఘటనలో లారీ డ్రైవర్ పరార్‌కాగా సంఘటనలో మృతి చెందినవారిని పోలీస్‌లు గుర్తించారు. మృతులంతా కరీంనగర్ రూరల్ మండలం చామనపెల్లి వాసులుగా గుర్తించారు. మృతులలో మాధవరావు, దేవమ్మ, సుశీల, లలిత, అంజలిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో గాయపడిన సుమారు పదిమందిని ప్రభుత్వా సుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని, ఆసుపత్రిని పోలీస్ రూరల్ ఎసిపి ఉషారాణి, కవిూషనర్ విబి కమలాసన్‌రెడ్డిలు సందర్శించారు. జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ సందర్శించి వైద్యులను పురమాయించి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనతెలియగానే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిది బండి సంజయ్, జిల్లా అద్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సందర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన పాల లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఆసుపత్రి వాతావరణం అంతా విషాదంగా మారిపోయింది. మెరుగైన వైద్యం అందించేందుకుగాను డాక్టర్లను ఆసుపత్రికి రప్పించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్‌నుంచి కలెక్టర్, కవిూషనర్లతో సంప్రతింపులు జరిపి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసెంబ్లీనుంచి హుటా హుటిన కరీంనగర్ బయల్దేరారు. మృతుల కుటుంబాల ఆక్రందనలతో ఆస్పత్రి పరిసరాలు మార్మోగింది.