తేమతో సంబంధం లేకుండా పత్తి కొనుగోళ్లు

నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌

ఖమ్మం,నవంబర్‌19(జనం సాక్షి): కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పత్తిలో తేమ శాతంపై పెట్టిన నిబంధనలను సడలించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ నిబంధన కారణంగా పత్తిని అమ్ముకునే వీలు లేకుండా పోయిందన్నారు. వర్షాల కారణంగా దిగుబడులు తగ్గి ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతులుమార్కెట్‌కు తీసుకుని వచ్చిన వెంటనే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేసారు. కనీసం సమాచారం ఇవ్వకుండానే పత్తి ట్రేడర్లు కొనుగోళ్లు నిలిపి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌ అధికారులు పత్తికి గిట్టుబాటు ధరలు కల్పించాలని, న్యాయం చేయాలని కోరారు. అంతేకాకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు రూ.2000 నుంచి రూ.4500 వరకు కొనుగోలు చేస్తూ రైతులను తీవ్రంగా నష్ట పరుస్తున్నారని తెలిపారు.