తేమపేరుతో మోసాలను అరికట్టాలి
పత్తి రైతుల విజ్ఞప్తి
ఆదిలాబాద్,అక్టోబర్24(జనంసాక్షి): పత్తి కొనుగోళ్ల సమయంలో తేమపేరుతో మార్కెట్లో దోపిడీ లేకుండా చూడాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఏటా తాము తేమపేరుతో భారీగా నష్టపోతున్నామని అన్నారు. ఇలా పండించిన పంటకు గిట్టుబాటు కూడా రావడం లేదని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలువురు రైతు సంఘాల నేతలు మరోమారు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. సజావుగా కొనుగోళ్లు సాగేలా చూడాలన్నారు. కఠినంగా ఆదేశాలు ఉంటే తప్పవ్యాపారులు వినరని సమస్యను తీసుకుని వెళ్లారు. పత్తి ధరలు, తేమశాతం తదితర అంశాలపై చర్చ సాగింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తికొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తేమ విషయంలోనూ వ్యాపారులు పేచీకి పోకుండా రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాలన్నారు. తూకాల్లోగానీ, తేమ యంత్రాల విషయంలోగానీ ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బంధీగా వ్యవహరించాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు. గ్రామాలవారీగా తేదీలను నిర్ణయించి టోకెన్లు జారీచేసి వచ్చిన రైతు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తిని విక్రయించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. గతంలో మాదిరి ఎలాంటి ఆందోళనకు దారితీయకుండా పత్తి కొనుగోళ్లు జరిగేలా సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతుల ప్రతినిధులు, పార్టీ నాయకులు, వ్యాపారులను కోరారు. తేమ యంత్రాల విషయంలో రైతులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిస్థానంలో కొత్త యంత్రాలను ప్రభుత్వం చేత ధ్రువీకరించినవి వినియోగించాలని నిర్ణయించారు.