తేమశాతంపై నిబంధనలు బేఖాతర్‌

తేమశాతంపై నిబంధనలు బేఖాతర్‌

ఏటా అన్యాయానికి గురవుతున్నామన్న రైతన్నలు

నిర్మల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): తేమశాతం విషయంలో వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బోథ్‌ మార్కెట్‌ పరిధిలోని జిన్నింగ్‌ కేంద్రాల్లో వ్యాపారులు పత్తిలో 8 శాతం తేమతో పత్తిని కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 12 శాతం తేమ ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. మంత్రి ఆదేశించినా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో పత్తి పంట ఎక్కువ సాగవుతుండగా పంట అమ్మకాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పత్తి పంటకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నది. జిల్లాలోని ఆదిలాబాద్‌, ఇచ్చోడ, బోథ్‌, ఇంద్రవెల్లి, జైనథ్‌ మా ర్కెట్‌ యార్డుల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. రైతులకు మద్దతు ధర లభించేలా ప్రతి సంవత్సరం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు

చేస్తున్నది. కొన్ని సందర్భాల్లో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో రైతులకు తమ పంటలను బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దళారులు గతంలో రైతుల వద్ద పంటను కొనుగోలు చేసి సీసీఐకి విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మార్కెట్‌లో జీరో వ్యాపారం సాగిస్తున్న వారితో పాటు వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తారు. రైతుల వద్ద పాసు పుస్తకాలు, ఇతర పత్రాలు తీసుకొని ఆ పంటను సీసీఐకి ఎక్కువ ధరకు విక్రయించిన సందర్భాలు కూడా గతంలో జరిగాయి. మహారాష్ట్ర నుంచి సై తం దళారులు జిల్లా కేంద్రానికి పత్తిని తీసుకొచ్చి ప్రభు త్వ రంగ సంస్థలకు విక్రయిస్తారు. ఇందుకోసం స్థానికంగా ఉన్న రైతుల పాసుపుస్తకాలను సేకరిస్తారు. ఇలా రాష్ట్రం నుంచే కాకుండా దళారులు తాము కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువకు సీసీఐకి పత్తిని అమ్మేందుకు వచ్చేవారు. అయితే ఇప్పుడు మాత్రం తేమపేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.