తేరుకోలేక పోతున్న నిర్మాణ రంగం

కొల్లూరు ఇటుకకు దక్కని ఆదరణ

విజయవాడ,జూలై11(జనం సాక్షి)): గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించకపోవడంతో ఆ పనులు నిలిచిపోయాయి. క్రమేపీ ఇసుక కొరత తీరినప్పటికీ నిర్మాణరంగం తేరుకోకపోవడంతో ఆ ప్రభావం ఇటుక పరిశ్రమపై పడిరది. కొల్లూరు మండలంలోని లంకగ్రామాల్లో సుమారు 200 వరకు ఇటుక పరిశ్రమలు ఉన్నాయి. గత మూడు నాలుగేళ్లుగా ధర పలుకగా నేడు కొనుగోళ్లు బాగా తగ్గిపోవడంతో ధరలు సగానికి సగం పడిపోయాయి. గత సీజన్‌లో తీసిన ఇటుకలు బట్టీల రూపంలో కల్లాల్లోనే ఉండటంతో పరిశ్రమదారులు ఇటుక ఉత్పత్తిని తగ్గించేశారు. గత సీజన్‌లో 50 లక్షల ఇటుకలు తీసిన వారు నేడు 20 లక్షల ఇటుకలను మాత్రమే ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కొంతమంది గత 7`8 నెలలుగా ఇటుకల విక్రయాలు లేకపోవడం, ధరలు క్షీణించడంతో నష్టపోయిన పరిశ్రమదారులు ఇటుకతీతకు ప్రస్తుత సీజన్‌లో స్వస్తి పలికారు. ఇటుక పరిశ్రమపై ఆధారపడిన వేలాదిమంది కూలీలు ఈ సీజన్‌లో ఉపాధి కోల్పోయారు. ఇటుక ఉత్పత్తిని పరిశ్రమదారులు సగానికి పైగా తగ్గించి గతంలో కంటే తక్కువ మంది కూలీలతో ఇటుక ఉత్పత్తి చేయిస్తున్నారు. కూలీలకు ఉపాధి లేకపోవడంతో చేసేదిలేక పరిశ్రమదారుల వద్దకు వెళ్లి కొంతకూలీ తగ్గించి అయినా పనులు చూపించాలని కోరుతుండటం గమనార్హం! కొల్లూరు ఇటుక పరిశ్రమల్లో పనిచేసేందుకు పరిసర గ్రామాల నుంచే కాకుండా విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల నుంచి వేలాది మంది కూలీలు ఇటుక తీతకు వలస వస్తారు. ప్రస్తుత సీజన్‌లో వలస కూలీల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇటుక విక్రయాలు తగ్గిపోవడంతో ఆ ప్రభావం రవాణా వ్యవస్థపైనా పడిరది. పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన ఇటుకను చేరవేయడంపై 300కు పైగా లారీలు, 500కు పైగా ట్రాక్టర్లు ఆధారపడి ఉన్నాయి. ఇటుక రవాణా లేకపోవడంతో వాటిపై ఆధారపడి జీవించేవారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటుక ఉత్పత్తి చేస్తే లక్ష ఇటుకలకు రూ.లక్షన్నర వరకు నష్టం
వస్తున్నట్లు పరిశ్రమదారులు చెబుతున్నారు. ఒక్క ఇటుక తయారీకి నాలుగున్నర రూపాయలు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఒక ఇటుకను మూడు రూపాయలకు మాత్రమే విక్రయించడం వల్ల నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఇటుక తయారీ చేసి కాల్చిన తర్వాత కొన్ని ఇటుకలు చిట్యాలుగా, దూతరాయిగా అవుతాయని వాటిని తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇవన్నీ లెక్కేస్తే లక్ష ఇటుకలు తయారుచేస్తే రూ.లక్షన్నర నష్టపోవాల్సి వస్తుందని పరిశ్రమదారులు వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగితే ఇటుక పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.