తైవాన్‌లో భారీ భూకంపం

2

– కుప్పకూలిన బహుళ అంతస్థుల భవంతులు

తైపీ,ఫిబ్రవరి 6(జనంసాక్షి):తైవాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. శిథిలాల్లో చిక్కుకుని మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. దాదాపు 150 మంది వరకు శిథిలాల్లో చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. భూకంపం సంభవించిన సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 16 అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులోని ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భూకంపం ధాటికి నగరంలోని వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు శిథిలాల్లో చిక్కుకున్న దాదాపు వందమందిని సురక్షితంగా బయటకు తీశారు. మృతుల్లో 10రోజుల వయసున్న పసికందు కూడా ఉంది. క్షతగాత్రులు సవిూపంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తైవాన్‌తో పాటు చైనాలో కూడా స్వల్పంగా భూమి కంపించింది