తైవాన్ పేరును వెంటనే మార్చేయండి
– లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు
– అమెరికా ఎయిర్‌లైన్లకు చైనా హెచ్చరిక
బీజింగ్, జులై25(జనంసాక్షి) : చైనా, అమెరికా ఒకరిపై ఒకరు కాలుదువ్వుతున్నాయి.. నిన్నమొన్నటి వరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం తీవ్రరూపం దాల్చగా ప్రస్తుతం మరో వివాదం ఇరుదేశాల మధ్య అగ్నిరాజేస్తుంది. ఫలితంగా మధ్య మరోసారి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తైవాన్ విషయమై చైనా.. అమెరికాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఎయిర్‌లైన్లు తమ వెబ్‌సైట్లలో తైవాన్ పేరు ‘చైనా తైవాన్’గా మార్చాలని స్పష్టం చేసింది. లేదంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దశాబ్దాల క్రితమే తైవాన్.. చైనా నుంచి విడిపోయింది. అయినప్పటికీ తైవాన్ తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల చైనా పౌర విమానయాన శాఖ విదేశీ విమానయాన సంస్థలకు ఓ లేఖ రాసింది. ఎయిర్‌లైన్లు తమ వెబ్‌సైట్లలో తైవాన్ పేరును చైనా తైవాన్‌గా మార్చాలని లేఖలో స్పష్టం చేసింది. ఈ లేఖతో ఇప్పటికే జపాన్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్‌లైన్స్, ఆస్టేల్రియా క్వాంటాస్, ఎయిరిండియా వెబ్‌సైట్లలో తైవాన్ పేరును మార్చేశాయి. అయితే అమెరికా మాత్రం చైనా ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రైవేటు సంస్థలపై రాజకీయ ఒత్తిడి ఎంతమాత్రం సరికాదని అమెరికా వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా పేర్కొన్న గడువు సవిూపిస్తున్నా అమెరికా
ఎయిర్‌లైన్లు తైవాన్ పేరును మార్చలేదు. దీంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ పేరును మార్చాలని లేదంటే సదరు విమానయాన సంస్థలు మూల్యం చెల్లించాల్సి వస్తుందని చైనా హెచ్చరిస్తోంది.
కాగా.. ఈ హెచ్చరికలపై అమెరికా ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్‌లు స్పందించారు. ఈ విషయమై వైట్‌హౌస్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వైట్‌హౌస్ మార్గదర్శకాల మేరకే తాము పనిచేస్తామని వెల్లడించారు.