తొలిరోజు భారత్‌దే!
రాణించిన టీమిండియా బ్యాట్స్‌మెన్
సెంచరీతో కదం తొక్కిన పుజారా
సిడ్నీ, జనవరి3(జనంసాక్షి) : సిడ్నీలో జరిగిన భారత్ – ఆస్టేల్రియా నాల్గోటెస్ట్ లో భారత్ బ్యాట్స్‌మెన్‌లు రాణించారు. తొలిరోజు ఆటలో తొలుత కొంత తడపడ్డా.. తరువాత పుంజుకొని భారీస్కోరు సాధించారు.. నయా వాల్ పుజారా (130 నాటౌట్) మరోసారి అదరగొట్టాడు. మరో బ్యాట్స్‌మన్ మయాంక్ (77) కూడా రాణించడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 303/4 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు ఆటలో మొత్తం పుజారానే కనిపించాడు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పడుతున్నా పుజారా మాత్రం క్రీజులో
కుదురుకున్నాడు. ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఓ దశలో రెండు మూడు సార్లు స్వల్పంగా గాయపడ్డాడు కూడా. అయినా ఎక్కడా తగ్గలేదు. తిరిగి మైదానంలోకి వచ్చి ఆసీస్ బౌలర్లను పరుగులు పెట్టించాడు. 199 బంత్లులో శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో తన టెస్టు కెరీర్‌లో పుజారా 18వ శతకాన్ని నమోదు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పుజారా 130 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరోవైపు మూడో టెస్టులో అంతగా ఆకట్టుకోని హనుమ విహారి (39; బ్యాటింగ్) సైతం చివరి టెస్టులో రాణించాడు. ఐదు బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పుజారా-విహారి జోడీ తొలి రోజు ఆట పూర్తయ్యే సమయానికి 75 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 303/4 పరుగులు చేసింది. మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇదే జోరును కొనసాగిస్తే భారత్ భారీ స్కోరును సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
నల్లటి బ్యాండ్లతో బరిలోకి టీమిండియా ఆటగాళ్లు
ద్రోణాచార్య పురస్కార గ్రహీత, ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ మృతికి టీమిండియా ఆటగాళ్లు నివాళులు అర్పించారు. అచ్రేకర్ బుధవారం సాయంత్రం ముంబయిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన మృతికి సంతాపంగా టీమిండియా ఆటగాళ్లు తమ చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు. వాటిని ధరించే మైదానంలోకి దిగారు. సచిన్ తెందుల్కర్, వినోద్ కాంబ్లీ వంటి క్రికెట్ దిగ్గజాలను భారతీయ క్రికెట్ జట్టుకు అచ్రేకర్ అందించారు. అచ్రేకర్ మృతికి సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు ఆసీస్ ఆటగాళ్లు సైతం మోచేతులకు నల్ల బ్యాండ్లు ధరించారు. ఆసీస్ మాజీ క్రికెటర్ బిల్ వాట్సన్(87) ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణానికి సంతాపంగా పైన్ సేన నల్లబ్యాండ్లు కట్టుకుని మైదానంలోకి దిగింది.