తొలిసారి వర్డే సీరిస్ ఓటమి
ఆగస్ట్ 1నుంచి టెస్ట్ క్రికెట్
లీడ్స్,జూలై18(జనం సాక్షి): టీ ట్వంటీలో రాణించి శుభారంభం పలికిన కోహ్లీ సేన వన్డేల్లో బోల్తా కొట్టింది. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ తొలి వన్డే సిరీస్ ఓటమిని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమితో సిరీస్‌ను చేజార్చుకుంది. కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న అనంతరం భారత్ వన్డే సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అలాగే భారత్ 2016 తర్వాత వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి. సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో వన్డేల్లో టీమిండియా సిరీస్ విజయపరంపరకు తెరపడింది. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్ గెలిచి వరుసగా 10 వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా ఆస్టేల్రియా సరసన నిలవాలనుకున్న భారత్ ఆశలకు గండి పడింది. 2016లో జింబాబ్వేపై 3-0తో సిరీస్ గెలిచిన భారత్ వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్టేల్రియా, దక్షిణాఫ్రికాపై ద్వైపాక్షిక సిరీస్‌లను సొంతం చేసుకుంది. 2017లో విరాట్ కోహ్లీ.. ధోనీ నుంచి పరిమిత ఓవర్ల భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ బాధ్యతలను అందుకున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది తొలి వన్డే సిరీస్ ఓటమి కావడం విశేషం.ఆతిథ్య ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత్ వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. కీలకమైన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆగస్టు 1 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు ఇంగ్లిష్ గడ్డపై భారత్ ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ను గెలవలేదు.